Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి
నవతెలంగాణ-సుబేదారి
మహాశివరాత్రి సందర్భంగా సందర్శకుల కోసం ఆలయాల్లో ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ సంధ్యారాణి అన్నారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లో మహా శివరాత్రి ఏర్పాట్లపై ఏసీపీ జితేందర్‌రెడ్డి, పలు ఆలయ అర్చకులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలోని వేయి స్థంబాల ఆలయం, మెట్టుగుట్ట రామలింగేశ్వర స్వామి దేవస్థానం, శ్రీ సిద్దేశ్వర స్వామి వారి ఆలయాలలో మహా శివరాత్రి నేపథ్యంలో ఈ నెల 28వ తేదీ నుండి మార్చి 04 ఉత్సవాలు నిర్వహించనుననట్టు పేర్కొన్నారు. అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు. పోలీసు శాఖ వారు ఉత్సవాల నేపథ్యంలో అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. సీసీ కెమెరాలు, పార్కింగ్ తదితర ఏర్పాట్లు చేయాలన్నారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో పారిశుధ్య కార్మికులతో నిరంతరం శుభ్రం చేయించడం కోసం చర్యలు తీసుకోవాలన్నారు. త్రాగు నీరు, మరుగుదొడ్లు, దోమల నివారణకు ఫాగింగ్, బ్లీచింగ్ పౌడర్ చల్లుట, లైటింగ్, డెకరేషన్ తదితర ఏర్పాట్లు చేయాలని సూచించారు. అనంతరం మహా శివరాత్రి ఉత్సవాల బుక్‌లెట్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ, రాగిచెడు అభిలాష, తహశీల్దార్ రాజ్ కుమార్, ఈఓలు పీ వేణుగోపాల్, కెే వెంకటయ్య, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.