Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆంధ్రలోని శ్రీకాకులం జిల్లాలో బిగించిన మీటర్లను సందర్శించిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి బృందం
నవతెలంగాణ-నర్సంపేట
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ పంప్సెట్లకు విద్యుత్ మీటర్ల బిగింపును వెంటనే వెనక్కి తీసుకోవాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకులం జిల్లా నర్సన్నపేట, గార మండలాల్లోని గోపాలపెంట, శ్రీకుర్మం గ్రామాలలో వ్యవసాయ పంప్సెట్లకు బిగించిన విద్యుత్ మీటర్లను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, తదితర ప్రజాప్రతినిధులు సందర్శించారు. ఈ సందర్భంగా పలువురి రైతులతో ముచ్చడించారు. పంప్సెట్లకు విద్యుత్ మీటర్ల బిగింపు వల్ల పెరిగిన ఆర్థిక భారంపై పలువురు రైతులు ఎమ్మెల్యే బృందానికి ఏకరువుపెట్టారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల పాటు నిరవధికంగా ఉచిత విద్యుత్‌ను అందిస్తుందని తెలిపారు. విద్యుత్ సరఫరాలో ఎన్నో అవాంతరాలను అధిగమించి తెలంగాణ ప్రభుత్వం రైతుల కష్టాలను తీర్చిందని గుర్తు చేశారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం విద్యుత్ సరఫరాను తన గుప్పిట్లోకి తీసుకొనేందుకు ఇప్పటికే డిస్కమ్‌లను లాక్కునే చర్యలు చేపట్టిందన్నారు. ఉచిత విద్యుత్‌ను ఎత్తేసి బిల్లుల భారం మోపి రైతుల నడ్డి విరిచేందుకు శ్రీకారం చుట్టిందని తెలిపారు. ఇక్కడి రైతులు మీటర్ల బిగింపును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్నారు.
తొలుత ఆంధ్రలోని శ్రీకాకులం జిల్లాలో మీటర్ల బిగింపు మొదలెట్టిందని, తాము పర్యటించిన ఈ గ్రామాలలో 30వేల పంప్సెట్లకు విద్యుత్ మీటర్లను అమర్చామని అక్కడి అధికారులు చెప్పారన్నారు. అది త్వరలో తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలు చేసేందుకు పూనుకుందన్నారు. కేంద్ర ప్రభుత్వం డ్రాప్ట్ బిల్లు తెలంగాణ ప్రభుత్వానికి పంపించదని చెప్పారు. మోటర్లకు మీటర్లు అమర్చాలని ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఇప్పటికే విద్యుత్‌పై అన్ని రకాల సబ్సిడీలను కేంద్రం దూరం చేస్తుందన్నారు.అత్యధిక భాగంలో బోరు, బావులపై ఆధారపడి సేధ్యం చేస్తున్న రైతులు ఎలా వ్యవసాయం చేయగలరని ప్రశ్నించారు. ఇటివల మీటర్ల బిగింపుపై కేసీఆర్ ప్రెస్‌మీట్ ప్రస్తావిస్తూ వ్యతిరేకించగా.. దానిని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి అది బూటకపు ప్రచారమని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. శ్రీకాకులం జిల్లాలో వ్యవసాయ పంప్సెట్లకు బిగించిన మీటర్లపై తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరులు సమాదానం చెప్పాలని డిమాండ్ చేశారు.
నేడు ఆంధ్రప్రదేశ్‌లో మొదలైన మీటర్ల బిగింపు రేపు దేశ వ్యాప్తంగా అమలు చేసేందుకు మోడీ ప్రభుత్వం సిద్ధపడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయం నుంచి రైతులను దూరం చేసి కార్పొరేటర్లకు అప్పగించడంలో భాగమే కేంద్రం ఈ కుట్ర చేస్తుందని దుయ్యపట్టారు. రైతులు ఈ మీటర్ల బిగింపును ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల రైతులు తీవ్రంగా వ్యతిరేకించి పోరాటాలకు సిద్ధం కావాల్సిన అవసరం ఉందని కోరారు. కేంద్రం సాగు చట్టాలను ఎలా వెనక్కి తీసుకుందో మీటర్ల బిగింపు వీడకపోతే రైతుల ఆగ్రహానికి కొట్టుకపోకతప్పదని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోతు రామస్వామి, జెడ్పీ వైఎస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, బాధవత్ వీరేందర్, పీఎస్సీఎస్ అధ్యక్షులు చెట్టుపెల్లి మురళీధర్‌రావు, రైతు సమన్వయ సమితి ప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు ఊడుగుల ప్రవీణ్, పాలెపు రాజేశ్వరావు, మురాల మోహన్ రెడ్డి, బాల్నె వెంకన్న, నాగెల్లి వెంకటనారాయణ గౌడ్, గుంటి కిషన్, గోనె యువరాజు, సూరయ్య తదితరులు పాల్గొన్నారు.