Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏఐకేఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి
నవతెలంగాణ-ఎన్జీవోస్ కాలనీ
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉందని ఏఐకేఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి అన్నారు. బుధవారం హనుమకొండ రాంనగర్‌లోని సుందరయ్య భవన్లో బండి పర్వతాలు అధ్యక్షతన నిర్వహించిన రైతు సంఘం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేంద్ర బడ్జెట్ కార్మికులు, రైతులు, కూలీలు, పేదలు మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలను పట్టించుకోలేదన్నారు. కార్పొరేట్ పెట్టుబడిదారుల ఆకాంక్షలకు అనుగుణంగా రూపొందిందని విమర్శించారు. స్వదేశీ, విదేశీ కార్పొరేట్ల రక్షణ కోసం రాయితీలను ప్రకటించిందని, ప్రాధాన్యత రంగాలను పట్టించుకోకుండా విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పేదలకు ఉపాధి, ఇండ్లు సంక్షేమాన్ని విస్మరించిందని తెలిపినారు. 40లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశ పెట్టినప్పటికీ, అది ఈ దేశ ప్రజల ఆకాంక్షను ప్రతిబింబించ లేదని, అందుకే తాము ఆ బడ్జెట్‌కు నిరసనగా ఈ నెల 25న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళను నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.
అనంతరం తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ సాగర్ మాట్లాడుతూ.. దేశంలో రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతోందన్నారు. కేంద్ర బడ్జెట్ రైతుకు రుణ విముక్తి కలిగించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్యల నివారణ కోసం రుణ విమోచన చట్టం చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయం రైతులకు సంబంధించిన పలు అంశాలను బడ్జెట్లో విస్మరించారని విమర్శించారు. ఎరువుల ధరలు పెంచి సబ్సిడీని తగ్గించడం ద్వారా రైతుల పై మరింత భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి కూలీలకు 200 రోజుల పనిదినాలు రూ 600 కూలీ ఇచ్చే వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు. ఈ సమావేశంలో రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడు శోభన, జిల్లా కార్యదర్శి శ్రీకాంత్, జిల్లా నాయకులు సారంపల్లి వాసుదేవరెడ్డి, గొడుగు వెంకట్, జి మహేందర్, జిల్లా కమిటీ సభ్యులు కె నారాయణ రెడ్డి, నవరత్న, జి బాబు రావు ,బి సాంబరాజు పాల్గొన్నారు.