Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పెదాపూర్ పంచాయతీలో భారీ కుంభకోణం..
ఎలుకంటి రవి ఆరోపణలు..
దళితుడైనందుకే అవిశ్వాసం..
నవతెలంగాణ-ఆత్మకూరు
పెద్దాపూర్ ఉపసర్పంచ్ ఎలకంటి రవిపై సొంత టీఆర్ఎస్ పార్టీ వార్డుసభ్యులు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. బుధవారం పెద్దాపూర్ పంచాయతీ సమావేశ మందిరంలో సర్పంచ్ సావూరె కమల రాజేశ్వర్‌రావు అధ్యక్షతన, ప్రత్యేకాధికారి, పరకాల ఇన్‌ఛార్జి ఆర్డీఓ వాసుచంద్ర నేతృత్వంలో ప్రత్యేక సమావేశం జరిగింది. అవినీతికి పాల్పడ్డాడనే ఆరోపణలతో ఉపసర్పంచ్ రవిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానం ఆమోదం పొందిన అనంతరం పెద్దాపూర్ సర్పంచ్ సావూరె కమల రాజేశ్వర్రావుపై రవి సంచలన ఆరోపణలు చేశారు. సర్పంచ్ కమల భర్త రాజేశ్వర్‌రావు అవినీతిని వ్యతిరేకించినందుకే తనపై అవిశ్వాస తీర్మానం పెట్టి, ప్రతి సభ్యుడికి రూ.25 వేలిచ్చి అవిశ్వాసానికి అనుకూలంగా ఓటేయించుకున్నారన్నారు. డీజిల్ 60లీటర్లకు బదులు 90లీటర్లు కొనుగోలు చేసినట్లు బిల్లులపై సంతకం చేయాలని ఒత్తిడి తీసుకువచ్చినా.. తాను సంతకం చేయకపోవడంతో దళితుడినైన తనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. డస్ట్బిన్లకు రూ.1.41 లక్షలతో కొనుగోలు చేసి, మరోమారు కొనుగోలు చేసినట్టు దొంగ బిల్లులు సృష్టించి.. దానిపై సంతకం చేయాలని తనపై ఒత్తిడి తెచ్చారని రవి ఆరోపించారు. గత సర్పంచ్ 50 ఎల్ఇడి లైట్స్ కొనుగోలు చేసి స్టోర్స్‌లో పెట్టగా, వాటికి కొత్త బిల్లులు సృష్టించి సంతకం పెట్టుమని ఒత్తిడి తెచ్చారన్నారు. మూడు వార్డులలో 90 ట్రిప్పుల మొరం పోయకున్నా, పోసినట్లు వార్డుసభ్యులతో తనపై సంతకం చేయాలని ఒత్తిడి తెచ్చినట్లు చెప్పారు.
దళితుడనైనందుకే అవిశ్వాసం : ఎలుకటి రవి
సర్పంచ్ భర్త సావురె కమల భర్త రాజేశ్వర్‌రావు అవినీతికి సహకరించనందుకే తనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారని దళిత ఉపసర్పంచ్ ఎలుకటి రవి ఆరోపించారు. దళితుడైనందుకే వార్డు సభ్యులకు సర్పంచ్ భర్త రూ.25 వేల చొప్పున ఇచ్చి అవిశ్వాసానికి ఓటేసేలా చేశారన్నారు. పంచాయతీలో జరిగిన కొనుగోళ్లపై విచారణ చేస్తే సర్పంచ్ కమల రాజేశ్వర్‌రావు భాగోతం బట్టబయలవుతుందన్నారు. డీజిల్ కొనుగోళ్లు, డస్ట్బిన్ల కొనుగోళ్లు, మొరం బిల్లుల అక్రమాలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. గ్రామంలో మూడు సీసీ రోడ్లను వేయడానికి, ఈదులగడ్డ స్మశానవాటిక వద్ద బాత్రూం, లెట్రిన్లను కట్టడానికి రవికి సర్పంచ్ భర్త రాజేశ్వర్‌రావు రాతపూర్వకంగా అనుమతినివ్వడం, వాటన్నింటినీ నిర్మించాక, నేటికీ వాటి బిల్లులు నాకు ఇవ్వడం లేదన్నారు. ఇప్పటి వరకు నాకు సహకరించిన ప్రజలు, సిబ్బందికి రవి కృతజ్ఞతలు తెలిపారు.