Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వెంకటాపురం
భూ క్రమ బద్దీకరణకు సంబంధించిన జీఓ 14ను ఏజెన్సీలో నిలిపేయాలని ఆదివాసీ నవనిర్మాణ సేన వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు సర్పంచ్ కొర్శా నర్సింహమూర్తి ఆధ్వర్యంలో బుధవారం డిప్యూటీ తహసీల్దారుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన భూబదలాయింపు చట్టం గిరిజన హక్కులను కాలరాసేల ఉందన్నారు. రాష్ట్రల విభజన సమయంలో ఏడు మండలాల ఆదివాసీలను ఆంధ్రాకి అమ్ముకొని, పోలవరం ప్రాజెక్ట్‌లో 2లక్షల మందిని జల సమాధి చేసి తెచ్చిన తెలంగాణలో ఆదివాసీలకు భద్రత కరువైందన్నారు. 317జీవో తెచ్చి మైదాన ప్రాంతాలకు చెందిన గిరిజనేతరులను షెడ్యూల్డ్ ప్రాంతాల్లోకి బదిలీ చేసి మరో 30ఏండ్ల వరకూ ఆదివాసీలకు ఉద్యోగాలు లేకుండా ప్రభుత్వం కుట్ర చేసిందని విమర్శించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆదివాసీలకు కనీస రక్షణ ఉండేదన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ని పాలించిన ఎన్నో పార్టీలు ఈ స్థాయిలో ఆదివాసీల హక్కులను కాలరాయలేదని మండిపడ్డారు. ఇప్పటివరకు ఆదివాసీల రక్షణ కోసం ఎటువంటి జీఓని తీసుకు రాకపోగా, ఉన్న చట్టాలను ఉల్లంఘించి గిరిజనేతరులకీ మేలు చేస్తోందని ఆరోపించారు. ఏజెన్సీలోకి గిరిజనేతరుల వలసలను ప్రోత్సహించే విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయన్నారు. ఆదివాసీల హక్కుల కోసం పోరాటం చేసే ఆదివాసీ సంఘాల మీద పోలీసుల చేత తప్పుడు కేసులు పెట్టించి ఉక్కు పాదం మోపుతున్నారన్నారు. ఆదివాసీ ప్రజా ప్రతినిధులు ఉత్సవ విగ్రహాలవలే నిమ్మకున్నారని విమర్శలు గుప్పించారు. ఆదివాసీల హక్కులను పరిరక్షించేందుకు పదవులు చేపట్టిన ఆదివాసీ ప్రజా ప్రతినిధులు తమ పదవుల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ఉండటం దుర్మార్గమైన చర్య అన్నారు. జీవో 14ని తక్షణమే ఏజెన్సీలో నిలుపుదల చేయాలని ఆదివాసీ నవనిర్మాణ సేన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏ ఎన్.ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వాసం నాగరాజు , మండల అధ్యక్షులు పోలేబోయిన భార్గవ్ , అట్టం లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.