Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాధారణ ఆదాయం రూ.7.10కోట్లు
గ్రాంట్ల ద్వారా రూ.42.02కోట్లు
నవతెలంగాణ-పరకాల
పరకాల పురపాలక సంఘం 2022-23 బడ్జెట్ ముసాయిదాను రూ.49.12కోట్లతో పాలకవర్గం ఆమోదించింది. శుక్రవారం మున్సిపాలిటీ సమావేశ మందిరంలో కమిషనర్ శేషు అధ్యక్షతన బడ్జెట్‌పై ప్రత్యేక సమావేశం జరుగగా.. ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ బడ్జెట్ ప్రతిపాదనలను సమర్పించగా పాలకవర్గం ఆమోదించింది. గతేడాది బడ్జెట్ రూ.44కోట్ల 54లక్షలు కాగా.. ఈ ఏడాది మరో రూ.5కోట్లను పెంచి బడ్జెట్‌ను రూపొందించారు. సాధారణ ఆదాయము రూ.7కోట్ల 10లక్షలు కాగా ప్రారంభ నిల్వ రూ.1.92కోట్లు ఉంది. అంచనా సాధారణ ఆదాయం రూ.9కోట్ల 3లక్షలు కాగా.. నాన్‌ప్లాన్ గ్రాంటు నిధులు రూ.2కోట్ల 20లక్షలు, ప్లాన్ గ్రాంటు నిధులు రూ.85లక్షలు, ఇతర గ్రాంటు నిధులు రూ.31.76కోట్లుగా బడ్జెట్ రూపొందించారు. కాగా బడ్జెట్ వ్యయాలు వేతనాలకు రూ.2కోట్ల 83లక్షలు, పారిశుద్ధ్య విభాగము రూ.90.10లక్షలు, విద్యుత్ ఛార్జీలకు రూ.56లక్షలు, హరితహారంకు రూ.87.58లక్షలు, ఇతర నిర్వహణ వ్యయాలు రూ.కోటి 61లక్షలు, అభివృద్ధి పనుల వ్యయం రూ.80.83లక్షలు. ఆస్తిపన్ను రూ.2.60కోట్లు, అసైన్డ్ రెవెన్యూస్ రూ.3కోట్లు ఉంది. మున్సిపల్ జనరల్ ఫండ్ అంచనా వ్యయం రూ.1.61కోట్లుగా అధికారులు అంచనా వేశారు. సాధారణ బడ్జెట్ ప్రారంభ నిల్వతో కలిపి రూ.9.03కోట్లు కాగా వ్యయం రూ.7.63కోట్లు, ముగింపు నిల్వ రూ.1.39కోట్లుగా బడ్జెట్లో పొందుపరిచారు. ఈ సమావేశంలో చైర్మన్ సోదా అనిత, వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్‌రెడ్డి, కౌన్సిలర్లు మార్క ఉమాదేవి రఘుపతి, శనిగరపు రజిని నవీన్‌కుమార్, మడికొండ సంపత్, బెజ్జంకి పూర్ణచారి, ఆర్పి.జయంతిలాల్, ఒంటేరు సారయ్య తదితరులు పాల్గొన్నారు.
మార్పులు చేసుకోవల్సిన అవసరం ఉంది : ఎమ్మెల్యే చల్లా
పురపాలక సంఘం 2022-23అంచనా బడ్జెట్‌ను మార్పులు చేసుకోవల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. బడ్జెట్లో కొన్నింటికి తక్కువ మొత్తాన్ని కేటాయించారని, పట్టణానికి సరిపోయే నిధులు కేటాయించబడలేదన్నారు. మురుగుకాలువల మరమ్మతులకు 22వార్డులకుగానూ రూ.3లక్షలు ఎలా సరిపోతాయని సభ్యులు అడిగిన ప్రశ్నను ఎమ్మెల్యే సభలోనే లేవనెత్తారు. పరకాల అభివృద్ధికి ఇటీవల రూ.25కోట్లు తీసుకురావడం జరిగిందని, అందులో రూ.13కోట్లు డ్రైనేజీకి, రూ.12కోట్లు వివిధ వార్డుల్లో రోడ్లకు కేటాయించినట్లు తెలిపారు. స్లాటర్‌హౌజ్ నిర్మాణానికి నిధులు మంజూరైనా పనులు ఎందుకు చేపట్టడంలేదని ఏఈని అడిగారు. ఏఈ ఏంచేస్తున్నాడో అర్థమైతలేదన్నారు. విధుల పట్ల శ్రద్ధ చూపించాలని సూచించారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి మాట్లాడుతూ పరకాల పట్టణంలో హరితహారం, పట్టణ ప్రగతి ఆశించిన స్థాయిలో పురోగతి లేదన్నారు. మరింత మెరుగుపర్చుకోవల్సి ఉందని చెప్పారు. ప్రణాళికతో ముందుకుసాగాలని, బడ్జెట్లో సభ్యులు సూచించిన సలహాలను తీసుకోవాలని చెప్పారు.