Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం
- కేంద్ర కమిటీ సభ్యులు జీ నాగయ్య
నవతెలంగాణ-నర్సంపేట
పేదల సంక్షేమాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరిస్తోందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం కేంద్ర కమిటీ సభ్యుడు జీ నాగయ్య విమర్శించారు. నమ్మిన స్వామి బుర్రి ఆంజనేయులు అధ్యక్షతన స్థానిక కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి విసృత్థ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. టీఆర్ఎస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని మండిపడ్డారు. వ్యవసాయ కార్మికులు దుర్భరమైన జీవితాన్ని గడుపుతూ గ్రామాల్లో పనులు లేక పట్టణ ప్రాంతాలకు వలస పోతున్నారని, వారి వలసలను నివారించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని మండిపడ్డారు. ఇంటి స్థలాలు లేని పేదలకు ప్రభుత్వమే భూమిని కొనుగోలు చేసి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఉద్యోగాలు మొత్తం ఆంధ్ర వాళ్ళు తీసుకో పోతున్నారని అరిచి గీ పెట్టినా ఈ ప్రభుత్వం ఖాళీలను ఎందుకు భర్తీ చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 5లక్షల ఉద్యోగాలను భర్తీ చేయకపోవడం ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమన్నారు. పోడు సాగుదారులకు హక్కులు కల్పిస్తానని చెప్పిన కేసీఆర్ ఆ సమస్యను నేటి వరకూ పరిష్కరించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చారని, ఆ పథకాన్ని మొత్తం ఎత్తివేయాలని కుట్ర కుతంత్రాలతో కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని దుయ్యబట్టారు. జిల్లాలోని వేలాది ఎకరాల ప్రభుత్వ భూములను పేదలకు పంచడంలో టీఆర్ఎస్ పభుత్వం తన చిత్తశుద్ధిని ప్రదర్శించాలన్నారు. ప్రజా, రైతు, కార్మిక సమస్యల పరిష్కారానికి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని పెేర్కొన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి భూక్య సమ్మయ్య, జిల్లా అధ్యక్షులు రంగయ్య, నాయకులు నవీన్‌ల స్వామి ఆంజనేయులు, బోళ్ల సాంబయ్య, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.