Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాలకుర్తి
ప్రభుత్వ పాఠశాలలను బాగు చేసుకునేందుకు ప్రజా ప్రతినిధులు, ప్రధానోపాధ్యాయులు, విద్యా కమిటీ చైర్మెన్లు సమన్వయంతో పనిచేసి కార్పోరేట్‌కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేయాలని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆదేశించారు. 'మన ఊరు మన బడి' కార్యక్రమం అమలుపై బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాలకుర్తి ఎంపీపీ నల్ల నాగిరెడ్డి అధ్యక్షతన పాలకుర్తి, కొడకండ్ల మండలాల ప్రజా ప్రతిని ధులు ప్రధానోపాధ్యాయులు, విద్యా కమిటీ చైర్మన్లు, అధి కారులు, కలెక్టర్ సీహెచ్ శివలింగయ్యతో కలిసి సమీక్షించి మంత్రి మాట్లాడారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. పాఠశాల ల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలని, ప్రభుత్వ పాఠశాలలో పోటీ తత్వాన్ని అలవర్చుకునేవిధంగా కృషి చేయాలని ఆదేశించారు. గురుకుల పాఠశాలల తరహాలోనే ప్రభుత్వ పాఠశాలలకు ప్రాధాన్యత ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ కట్టుబడి ఉన్నారన్నారు. పాఠశాలలకు సకల సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. దాతల సహకారం తీసుకోవాలని, పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమం అమలు కోసం కమిటీలను ఏర్పాటు చేసి ప్రజల ను భాగస్వామ్యం చేయాలన్నారు. 'మన ఊరు మన బడి' కార్యక్రమంలో ఎంపికైన పాఠశాలల నిర్వహణపై ప్రజా ప్రతినిధులు, ప్రధానోపాధ్యాయులు, విద్యా కమిటీ చైర్మన్లు నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సర్పంచులే బాధ్యత తీసుకొని పనిచేయాలని, క్రీడలను ప్రోత్సహిం చేందుకు క్రీడా మైదానాలను అభివృద్ధి చేయాలన్నారు.
సమీక్షలకు రాని సర్పంచులపై చర్యలు తీసుకోవాలి
రాజకీయాలకతీతంగా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివద్ధి సంక్షేమ పథకాల అమలుపై నిర్వహించే సమీక్ష సమావేశాలకు హాజరు కాని సర్పంచ్‌లపై చర్యలు తీసుకో వాలని జిల్లా కలెక్టర్‌ను మంత్రి ఆదేశించారు. గ్రామాల అభి వృద్ధిలో రాజకీయాలకు తావులేదని, గతంలో నిర్వహించిన సమీక్షా సమావేశాలకు కొందరు సర్పంచులు హాజరు కాకపో వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సర్పంచుల చెక్ పవర్ రద్దు చేయాలని ఆదేశించారు. సర్పంచులు రాకుంటే ఎంపీటీసీ లకు బాధ్యతలు ఇవ్వాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్లు భాస్కర్‌రావు, హమీద్, ఆర్డీఓ కష్ణవేణి, డీపీఓ రంగాచారి,కొడకండ్ల ఎంపీపీ జ్యోతి, డీసీసీబీ చైర్మెన్ వెంకటేశ్వర రెడ్డి, జెడ్పీటీసీలు పూస్కూరి శ్రీనివాసరావు, సత్తమ్మ, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు వీరమనేని యాకాంతారావు, జీసీసీ మాజీ చైర్మన్ మోహన్ గాంధీ నాయక్, ఐలమ్మ మార్కెట్ కమిటీ చైర్మన్ ముస్కు రాంబాబు, జిల్లా కోఆప్షన్ సభ్యులు ఎండి మదర్, వందేమాతరం ఫౌండేషన్ వ్యవస్థాపకులు రవీందర్రావు, బాలవికాస బాధ్యులు సౌరెడ్డి, సిందే రామోజీ తదితరులు పాల్గొన్నారు.