Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
వరంగల్ తూర్పు నియోజకవర్గం అధికార టీఆర్ఎస్ పార్టీలో అందరూ ప్రముఖులే ఉన్నారు. దీంతో వచ్చే శాసనసభ ఎన్నికల్లో పార్టీ టికెట్‌కు ఇప్పటి నుండే పావులు కదుపుతున్నారు. ఈ నియోజకవర్గంలో ఇద్దరు ఎమ్మెల్సీలు, మేయర్, ప్రముఖ పారిశ్రామిక వేత్తలు సైతం ఇక్కడి నుండే ఉండడంతో వారంతా టీిఆర్‌ఎస్ పార్టీ టికెట్ కోసం పోటీపడుతున్నారు. ఏ నియోజకవర్గంలో లేనివిధంగా తూర్పులో ఆశావహులు అధికంగా ఉండడం ప్రస్తుత ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌కు తలనొప్పిగా పరిణమించింది. గత ఎన్నికల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తమ్ముడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు రెబల్‌గా రంగంలోకి దిగాక అధిష్టానం జోక్యం చేసుకోవడంతో ఆయన విరమించుకున్న విషయం విదితమే. ఈసారి పార్టీ టికెట్ కోసం 5గురు నేతలతో స్థానిక ఎమ్మెల్యే 'నన్నపనేని'కి తీవ్ర పోటీ నెలకొంది. దీంతో అధికార టిఆర్ఎస్లో వీరి మధ్య పోటీ ఆసక్తికరంగా పరిణమించింది.
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌కు సన్నిహితుడిగా వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌కు ముద్రపడింది. కాగా నియోజకవర్గంలో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, ఎమ్మెల్సీ డాక్టర్ బండా ప్రకాశ్, మేయర్ గుండు సుధారాణి, ప్రముఖ పారిశ్రామిక వేత్త, గాయత్రీ గ్రానైట్స్ అధినేత వద్దిరాజు రవిచంద్ర, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తమ్ముడు, వరంగల్ అర్భన్ కోఆపరేటివ్ బ్యాంకు ఛైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్‌రావు వచ్చే శాసనసభ ఎన్ని కలకు సమాయత్తమవుతున్నారు. వీరంతా అధికార టీఆర్ఎస్ పార్టీ టికెట్‌ను ఆశిస్తున్న నేతలే కావడం గమనార్హం.
'మేయర్'ను ఒంటరి చేస్తున్న వైనం..
వరంగల్ తూర్పు నియోజకవర్గం నుండి టీిఆర్‌ఎస్ పార్టీ టికెట్నాశిస్తున్న మేయర్ గుండు సుధారాణిని ఒంటరిని చేస్తున్న వైన మిది. మేయర్‌గా ఎన్నికైన అనంతరం 'గుండు' వద్దకు టీఆర్ఎస్ కార్పొరేటర్లు వెళ్లకుండా నగర ఎమ్మెల్యేలు కట్టడి చేయడం గమనార్హం. దీంతో మేయర్ ప్రాధాన్యత పెరగకుండా నగర ఎమ్మె ల్యేలు నియంత్రించడం అటు పార్టీలు, ఇటు నగరంలో చర్చనీయాంశంగా మారింది. గత శాసనసభ ఎన్నికల్లో గుండు సుధారాణి పార్టీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించిన విషయం విదితమే. వచ్చే శాసనసభ ఎన్నికల్లో పార్టీ టికెట్ కోసం తీవ్రంగా మేయర్ ప్రయత్ని స్తున్నట్లు ఆమె వర్గీయులు చెబుతున్నారు.
ప్రముఖుల పోటాపోటీ..
ఈ నియోజకవర్గం నుండి గత శాసనసభ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఆశించి భంగపడిన ఎర్రబెల్లి ప్రదీప్‌రావు రెబల్‌గా రంగంలోకి దిగి భారీ ర్యాలీని నిర్వ హించారు. ఈ క్రమంలో పార్టీ అధిష్టానం ప్రదీప్‌రావు అన్న దయాకర్‌రావును రంగంలోకి దింపి బరి నుండి ఉపసంహరించుకునేలా చేశారు. దీంతో పోటీ నుండి తప్పుకున్న ప్రదీప్ రావుపై ఆయన అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు నేతలు ఇతర పార్టీల్లో చేరిపోయారు. ఇదిలా ఉంటే గత ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గాయత్రి గ్రానైట్స్ అధినేత వద్దిరాజు రవిచంద్ర, టీఆర్ఎస్ అభ్యర్థి నన్నపనేని
నరేందర్‌కు గట్టి పోటీనిచ్చి స్వల్ప మెజార్టీతో ఓటమిపాలయ్యారు. ఎన్నికల అనంతరం 'వద్దిరాజు' టిఆర్ఎస్లో చేరారు. ఆయన్ను మంత్రి దయాకర్‌రావు పార్టీలో తీసుకురావడం పట్ల ఎమ్మెల్యే 'నన్నపనేని' మంత్రి పట్ల కినుక వహించారు. టీఆర్ఎస్లో 'వద్దిరాజు' క్రియాశీలక పాత్ర పోషిస్తుండడం పట్ల 'నన్నపనేని' వర్గం అసహనంతో వుంది.
సీనియర్ నేతలతో ఢీ..
ఇదే నియోజకవర్గంలో సీనియర్ నేత, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య పార్టీ అధిష్టానానినికి అత్యంత సన్నిహితుడిగా వున్నారు. పార్టీ అధిష్టానం దృష్టిలో వుండడం వల్లే 'బస్వరాజ్'కు ఎమ్మెల్సీ పదవి దక్కింది. వచ్చే శాసనసభ ఎన్నికల్లో అధికార టిఆర్ఎస్ పార్టీ టికెట్‌ను 'బస్వరాజ్' ఆశిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌కు 'బస్వరాజ్'తో సఖ్యత లేదు. ఇదిలావుంటే తాజాగా ఎమ్మెల్సీగా ఎన్నికైన డాక్టర్ బండా ప్రకాశ్ కూడా ఇదే నియోజకవర్గం కావడం గమనార్హం. ఈ 5గురు నేతలు పార్టీ అధిష్టానంతో టచ్‌లో వుండే నేతలు కావడం 'నన్నపనేని' జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదిలావుంటే మంత్రి దయాకర్‌రావుతో ఎమ్మెల్యేకు సత్సంబంధాలు లేవని పార్టీలో ప్రచారం జరుగు తుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికలు 'నన్నపనేని'కి ఉత్కంఠభరితమైనవిగా రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.