Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్వే చేపట్టి సమస్య పరిష్కరిస్తామన్న ఎంపీపీ
నవతెలంగాణ-శాయంపేట
శాయంపేట- మైలారం గ్రామా ల మధ్య పశు వైద్యశాల సమీపంలో నిర్మిస్తున్న హై లెవల్ వంతెన నిర్మాణ పనులను బుధవారం రైతులు అడ్డుకున్నారు. 50మీటర్ల పొడవున వచ్చే వరద నీటిని కేవలం 12.5 ఫీట్ల వెడల్పుతో వెళ్లేలా మోరిలు వేయడంతో 30ఎకరాల వ్యవసాయ భూములలో సాగు చేస్తున్న పంటలు వరద నీటికి కొట్టుకుపోతాయని చెబుతూ వారు పనులను నిలిపి వేశారు. విషయం తెలిసి ఆర్ అండ్ బీ జేఈ గోపి ఘటనా స్థలానికి వచ్చి రైతులతో మాట్లాడారు. మోరిలకు అవతలి వైపు 50మీటర్ల పొడవున ప్రొటెక్షన్ వాల్ కట్టాలని రైతులు కోరారు. ఆర్ అండ్ బీ డిపార్ట్మెంట్ నుంచి ఆ పనులు చేయడానికి వీలు కాదని చెప్పడం తో రైతులు వినలేదు. జేఈ గోపి ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు.
రైతుల ఆందోళన విషయం తెలుసుకున్న స్థానిక ఎంపీపీ మెతుకు తిరుపతి రెడ్డి, ఉప సర్పంచ్ దైనంపల్లి సుమన్లు ఘటనా స్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడారు. అధికారులను పిలిపించి పరిస్థితిని వివరించి రైతులకు నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. శాయంపేట గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ నిధులతో పనులు చేపిస్తానని ఉప సర్పంచ్ దైనంపల్లీ సుమన్ రైతులకు హామీ ఇచ్చారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు.