Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేషన్ ఈడీ మాధవిలత
పేద దళితుల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ఎస్సీ కార్పొ రషన్ అనేక పథకాలు అమలు చేస్తోందని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) మాధవి లత తెలిపారు. జూనియర్ అసిస్టెంట్ స్థాయి నుంచి కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వరకు అంచెలంచెలుగా ఆమె ఎదిగారు. అనేక మంది పేద లబ్దిదారులకు రుణాల మంజూరులో, కార్పొరేషన్ అమలు చేస్తున్న పథకాలను అమలు చేయడంలో క్రియాశీలకంగా ఆమె వ్యవహస్తున్నారు. ఈ క్రమంలోనే 'నవతెలంగాణ' ప్రత్యేక ఇంటర్వ్యూ..
నవతెలంగాణ-సుబేదారి
నవతెలంగాణ : ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఏయే పథకాలు అమలవుతున్నాయి.
ఈడీ : ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ దళిత యువతకు స్వయం ఉపాధి కోసం సబ్సిడీపై రుణాలు అందిస్తున్నాం. అలాగే పేద రైతులకు మొదటి పంట సాగుకు, భూమి అందించి అభివృద్ధి, బోర్లు, బావుల ఏర్పాటుకు రుణాలిస్తున్నాం. సాగునీటి, విద్యుత్ అవసరాల కోసం సబ్సిడీపై బోర్లు, విద్యుత్ మోటార్లు అందిస్తున్నాం. అలాగే నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోసం అర్హతలను బట్టి పలు అంశాల్లో ఉచిత శిక్షణ ఇప్పిస్తున్నాం. అనంతరం ఉపాధి ఏర్పాటు చేసుకునేలా సబ్సిడీపై రుణాలు పొందవచ్చు.
నవతెలంగాణ : జిల్లాలో దళితబంధు అమలు ఎలా ఉంది.
ఈడీ : కమలాపూర్ మండలంలోని లబ్దిదారులకు గ్రౌండింగ్ పూర్తి చేశాం. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ లిస్టు తయారైంది. మంత్రి నుంచి అప్రూవల్ రావాల్సి ఉంది. అలాగే 47 మంది పేర్లతో వర్ధన్నపేట, 79 మంది పేర్లతో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం, 100 మంది పేర్లతో పరకాల లిస్టు అందాయి. పరకాలలోని అర్హులకు శిక్షణా తరగతులు కూడా మొదలయ్యాయి.
నతె : ప్రభుత్వ ఉద్యోగిగా మీ ప్రస్తానం..?
ఈడీ : 1999లో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరాను. అనంతరం 2004లో సీనియర్ అసిస్టెంట్‌గా, 2013లో ఏఈఓ, 2018లో ఈఓగా ఉద్యోగోన్నతులు పొందాను. మహబూబాబాద్, జనగామ, హనుమకొండల్లో విధులు నిర్వర్తించాను 2021 జనవరిలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ)గా ఉద్యోగోన్నతిపై బాధ్యతలు తీసుకున్నాను.
నతె: విధి నిర్వహణలో తృప్తినిచ్చిన అంశాలు ఉన్నాయా?
ఈడీ : స్కావెంజర్ల కోసం రీహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేసి కార్మికులకు ఆధునిక పరికరాలు ఇప్పించాం. అలాగే అర్హులకు 7సీటర్ ఆటోలు మంజూరు చేశాం. పే అండ్ యూజ్ టాయిలెట్లు నిర్మింపజేసి ఉపాధి కల్పించాను. లబ్దిదారులకు కాంక్రీట్ మిషన్లు, సెప్టిక్ ట్యాంక్ క్లీనర్ వాహనాలు ఇప్పించాను. అలాగే ఇప్పటివరకు సుమారు 5 వేల మందికిపైగా రుణాలు మంజూరు చేశాము.
నతె : విధి నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు ఎదురౌతాయి?
ఈడీ : పేదలకు కార్పొరేషన్ ద్వారా అమలౌతున్న పథకాలపై అవగాహన కల్పించాల్సిన క్రమంలో ప్రజాప్రతినిధులను, క్షేత్రస్థాయిలో పెద్దలను భాగస్వాములను చేయాల్సి ఉంటుంది. అర్హత కలిగిన వారికి రుణాలు మంజూరు చేయాలి. ఈ విషయాల్లో కొంత ఒత్తిడి ఉంటుంది. రుణాలు మంజూరు చేసే అవకాశం లేని పరిస్థితుల్లో దరఖాస్తుదారులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఏర్పడుతోంది. దరఖాస్తు చేసినప్పటి నుంచి గ్రౌండింగ్ చేసే వరకు పలు దశలుంటాయి. ఆయా సందర్భాల్లో జాప్యం జరుగుతోందని లబ్దిదారులు భావించే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం నుంచి నిధులు రావడంలోనూ జాప్యం జరుగుతుంది.
నతె : ఒక మహిళగా ఉద్యోగం సాధించడం, ఉన్నతస్థాయికి చేరడంలో మీ అనుభవం?
ఈడీ : మా కుటుంబంలో అందరూ ఉన్నత విద్యాభ్యాసం చేసిన వాళ్లే. అందుకే నేను కూడా చదువుల్లో రాణించాను. ఉద్యోగం సాధించాను. విధి నిర్వహణలో సమర్ధత, అనుభవాన్ని బట్టి ఉద్యోగోన్నతులూ వస్తాయి. ఇప్పటివరకు సుమారు 23 ఏండ్లపాటు వివిధ ప్రాంతాల్లో వేర్వేరు హోదాల్లో విధులు నిర్వర్తించాను.
నతె : మహిళలకు మీరే అందించే సూచన.
ఈడీ : మహిళలు తప్పనిసరిగా ఉన్నత విద్యను అభ్యసించాలి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై అవగాహన పెంచుకోవాలి. విద్యార్థి దశలోనే భవిష్యత్ గురించి పెద్దలు, మేథావులతో చర్చించాలి. వారి అనుభవాన్ని గమనంలో పెట్టుకుని అవసరమైన ప్రణాళికను సిద్ధం చేసుకుని ముందుకు సాగాలి.