Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మిక సంఘాల పిలుపు..
- ఈ నెల 12న జిల్లా సదస్సు
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
మార్చి 28, 29 తేదీలలో నిర్వహించే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. గురువారం హన్మకొండలోని సుందరయ్య భవన్లో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు తోట భిక్షపతి అధ్యక్షతన సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, టీఆర్ఎస్కేవీ, ఐఎఫ్‌టీయూల సంయుక్త సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి రాగుల రమేశ్ మాట్లాడుతూ.. 1991లో నయా ఉదారవాద సంస్కరణలు ప్రవేశపెట్టిన అనంతరం కార్మికవర్గం చేస్తున్న 21వ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ఇదేనన్నారు. లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అత్యవసర రక్షణ సేవల చట్టాన్ని రద్దు చేయాలని, ప్రైవేటీకరణ, జాతీయ నగదీకరణ ఆపివేయాలన్నారు. వ్యవసాయం, విద్య, వైద్యం వంటి కీలక రంగాలకు ప్రభుత్వం పెట్టుబడులు పెంచాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ చట్టం అమలుకు నిధులు కేటాయింపు పెంచాలని, ఈ చట్టాన్ని పట్టణ ప్రాంతాలకు విస్తరించాలన్నారు. సంపన్నులపై సంపద పన్ను విధించడం ద్వారా పై చట్టం అమలుకు ఆర్ధిక వనరులు సహకరించారని, తద్వారా ఆర్ధిక పరిస్థితిని పునరుద్ధరించాలన్నారు. పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలను అరికట్టాలన్నారు. జాతీయ పెన్షన్ పథకాన్ని రద్దు చేసి పాత పెన్షన్ పథకం అమలు చేయాలన్నారు. పై ప్రధాన డిమాండ్లతో సార్వత్రిక సమ్మె జరుగనుందన్నారు. కార్మికులందరికీ కనీస వేతనాలు, సార్వత్రిక సామాజిక భద్రత, కాంట్రాక్ట్ కార్మికుల సర్వీసు క్రమబద్ధీకరణ, స్కీం వర్కర్లను సంబంధిత సకల ప్రయోజనాలకు అర్హులైన కార్మికులుగా గుర్తించడం వంటి డిమాండ్లు ఇందులో వున్నాయన్నారు. కార్మిక హక్కులను కాలరాసేందుకు యజమానులకు అనుకూలంగా పని పరిస్థితులను మార్చేందుకు ప్రయత్నాలు ముమ్మరమవుతున్నాయన్నారు. ఈ కుట్రలను ప్రతిఘటించడానికి కార్మికులకు యావత్తు సన్నద్ధం కావాలన్నారు.
12న జిల్లా సదస్సు
దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయడంలో భాగంగా ఈ నెల 12న జిల్లా సదస్సును నిర్వహిస్తున్నట్టు రాగుల రమేశ్ తెలిపారు. దేశవ్యాప్త సమ్మెకు పిలుపునివ్వడానికి గల కారణాలను ఈ సదస్సు ద్వారా కార్మికులకు తెలియజేయనున్నట్టు పేర్కొన్నారు. ఈ సదస్సులో అన్ని కార్మిక సంఘాలు పాల్గొని జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు గాదె ప్రభాకర్‌రెడ్డి, జిల్లా నాయకులు టీ ఉప్పలయ్య, వేల్పుల సారంగపాణి, బొట్ల చక్రపాణి, టీఆర్ఎస్కేవీ నాయకులు రవీందర్‌రెడ్డి, ప్రణరు, ప్రశాంత్, ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షులు అప్పారావు, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు పుల్లా రమేశ్ తదితరులు పాల్గొన్నారు.