Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దరఖాస్తులకే పరిమితమైన పక్రియ
- పట్టాల కోసం నెలల తరబడి గిరిజనుల ఎదురుచూపు
నవతెలంగాణ-మహాముత్తారం
పోడు రైతుల పట్టాల దరఖాస్తుల ప్రక్రియ మరుగున పడింది. అటవీ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు ఆర్ఓఎఫ్ఆర్ అటవీ సాగు గుర్తింపు హక్కు పత్రాలు ఇవ్వాలనే డిమాండ్ నేపథ్యంలో ప్రభుత్వం హక్కు పత్రాలు ఇస్తామని ప్రకటించింది. గతేడాది నవంబర్ 8 నుంచి డిసెంబర్ 8 వరకు అటవీ భూములను సాగు చేస్తున్న వారి దరఖాస్తులు స్వీకరించింది. ప్రతి గ్రామంలో ఫారెస్ట్ రైట్స్ కమిటీ ఏర్పాటు చేసి దశలవారీగా అర్జీలను పరిశీలించింది. అటవీ, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా విన తులు స్వీకరించారే తప్ప హక్కు పత్రాలు ఇవ్వని దుస్థితి నెలకొంది.
మండలవ్యాప్తంగా 37 గ్రామాల్లోని రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. 6481 మంది పోడు సాగుదారులు దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో గిరిజనులు 2841 మంది, గిరిజనేతరులు అత్యధికంగా 3640మంది దరఖాస్తులు చేసుకున్నారు. గ్రామ, జిల్లా స్థాయి పరిశీలన పూర్తై నాలుగు నెలలు గడుస్తున్నా హక్కు పత్రాల అదజేత ప్రక్రియ ముందుకు సాగడం లేదు. దీంతో అర్హులైన పోడుదారులు రైతుబంధు, రైతు బీమా, పీఎం కిసాన్, బ్యాంకు రుణాలు తదితర ప్రయోజనాలకు దూరమవుతున్నారు. కాగా కాంగ్రెస్ హయాంలో 2005లో కొంతమంది రైతులకు హామీ పత్రాలు అందాయి. 2014 అధికారంలోకి రాకముందు టీఆర్ఎస్ ప్రతి ఒక్క సాగు దారుడికి హక్కు పత్రాలు ఇస్తామని హామీనిచ్చి నేడు జాప్యం చేయడం గమనార్హం.
ఆగని పోడు గొడవలు
అటవీ సాగుదారులు, అధికారుల మధ్య రోజు రోజుకూ పోడు గొడవలు అధికమవు తున్నాయి. ఇటీవల మహాముత్తారం మండలం దొబ్బల్పాడ్ లో వివాదం నెలకొన్న విషయం విధితమే. అటవీ సంరక్షణ అధికారులు పోడు భూములు జప్తు చేసుకోవడం కోసం చదును చేసి మొక్కలు నాటే, కందకాలు, కార్యక్రమ ములు చేస్తుండడంతో ఆక్రమణదారుల వ్యతి రేకతతో పలుచోట్ల ఘర్షణలు అవుతున్నాయి. గిరిజనులపై కేసులు పెట్టి భయబ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి నెలకొంది. హక్కు పట్టాల కోసం అధికారులను అడిగితే ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాగానే అర్హులను గుర్తిస్తామని చెబుతుండడం గమనార్హం.
అదే మా జీవనాధారం
పోడు పట్టాలొస్తాయని ఆదివాసి, గిరిజన బతుకులు మారుతాయని ఎదురు చూస్తుంటే ఫారెస్ట్ అధికారులు మా భూముల్లో అక్రమంగా మొక్కలు నాటారు. అటవీశాఖ అధికారులు పోడు సాగు దారులపై దాడులు చేస్తూ కేసులు పెడుతూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇది పథకం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం దాడులు చేయిస్తోంది. 2005 ప్రకారం హక్కు పత్రాలు ఇవ్వాలి.
- తోలెం వెంకటేష్, ఎంపీటీసీ