Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చాంబర్ అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి
నవతెలంగాణ-కాశిబుగ్గ
వరంగల్ జిల్లా ఎక్స్పోర్ట్ హబ్‌గా మారడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండిస్టీ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్ రెడ్డి అన్నారు. శనివారం ఛాంబర్ కార్యాలయంలో ఫెడరేషన్ ఆఫ్ ఇండి యన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్, చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండిస్టీ ఆధ్వర్యంలో జిల్లా పరిశ్రమల శాఖ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో విదేశీ ఎగుమతులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులు మార్కెట్లోకి వస్తున్నాయని చెప్పారు. దేశంలోనే మొట్ట మొదటి ఆర్బిట్రేషన్ సెంటర్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హైదరా బాద్‌లో ఏర్పాటుకు ఫౌండేషన్ వేశారని అన్నారు. దీంతో రాష్ట్రంలో ఎగుమతులు పెరగడానికి అవకాశాలు ఎక్కువయ్యాయని తెలిపారు. జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ నరసింహ మూర్తి మాట్లాడుతూ కేంద్రం వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ పాలసీని తీసుకొచ్చిందని అన్నారు. దేశంలోనే ఎగుమతికి ఎంపిక చేసిన ఐదు జిల్లాల్లో వరంగల్ కూడా ఒకటని అన్నారు. ఎంఎస్ఎంఈ నియమాలు మారుతున్నాయని, ఏప్రిల్ నుంచి ఆధార్ నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో హార్టికల్చర్,సెరికల్చర్ జిల్లా అధికారి శ్రీనివాస రావు,, ఎస్బిఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ బాలానంద్, ట్రేడ్ సర్వీస్ డిప్యూటీ డైరెక్టర్ హషికేశ్ రెడ్డి, ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారెటీ కార్పొరేషన్ మేనేజర్ శివ శంకరి, ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్ జాయింట్ డైరెక్టర్ శ్రీనాథ్, చాంబర్ ప్రతినిధులు చంద్రమౌళి, వేద ప్రకాష్, శ్రీనివాస్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.