Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడ
పోడురైతులపై అటవీ శాఖ అధికారుల దాడులను వెంటనే ఆపాలని టీపీసీసీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ చల్లా నారాయణరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వజ్జ సారయ్య డిమాండ్ చేశారు. మండలానికి చెందిన పోడు రైతు సోం బాబును చితకబాదిన అటవీశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో శనివారం ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నారాయణరెడ్డి, సారయ్య మాట్లాడారు. పోడు రైతులకు పట్టాలిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా అటవీ శాఖ అధికారులు జులుం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అర్హులందరికీ పట్టాలివ్వడంతోపాటు వెంటనే అటవీ శాఖ అధికారుల దాడులను నిలిపేసేలా ఆదేశించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు ఉల్లెంగుల రమేష్, మాజీ ఎంపీటీసీ బానోత్ రూప్ సింగ్, నాయకులు సంగి సంపత్, వెల్దండి వేణు, మండల పరిషత్ కోఆప్షన్ సభ్యుడు సయ్యద్, పాషా, తదితరులు పాల్గొన్నారు.