Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు బందోబస్తు
- జాతరకు ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు
నవతెలంగాణ-హసన్‌పర్తి
ఎర్రగట్టు వెంకటేశ్వరస్వామి (ఎర్రగట్టు) జాతర ఈనెల 16 నుంచి ప్రారంభం కానుంది. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తుల తాకిడి రోజురోజుకు పెరుగుతోంది. స్వామివారిని దర్శించుకునేందుకు వివిద ప్రాంతల నుంచి భక్తులు లక్షలాదిగా తరలివస్తున్నారు. సుమారు 3 వేల ఏండ్లుగా ఏటా శ్రీఎర్రగట్టు వెంకటేశ్వరస్వామి జాతర ఎంతో వైభవంగా జరుగుతూ వస్తున్నట్లు కాకతీయులకు పూర్వమే ఈ క్షేత్రము ఎంతో వైభవంగా విలసిల్లినట్లుగా చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది.
కరీంనగర్-హన్మకొండ ప్రధాన రహదారి సమీపంలోని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి అంబాల క్రాసురోడ్డు వద్ద గుట్టపై వెలసిన శ్రీఎరగ్రట్టు వెంకటేశ్వరస్వామి జాతర ఏటా మార్చిలో హోళీ ఫాల్గుణ పౌర్ణమి రోజున ప్రారంభమై ఐదు రోజుల పాటు కొనసాగుతుంది. జాతర ఉత్సవ వేడుకల సమయంలో కరీంనగర్, వరంగల్ జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాది భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు...
స్థలపురాణం.....
సుమారు 3 వేల ఏండ్ల క్రితం నుంచి ఈ జాతర జరుగుతున్నట్లు ఆధారాలను బట్టి తెలుస్తోంది. మండల శివారులోని ఎల్లాపూర్ సమీపంలోని గుట్టపై తొలిసారిగా స్వామివారు వెలిసినట్లు స్థలపురాణాలు చెబుతున్నాయి. అయితే ఇక్కడి ప్రాంతం అనుకూలంగా లేకపోవడంతో స్వామివారు వక్కల గుండుపై పాదం మోపి అక్కడి నుంచి నల్లగట్టుగుట్టపై వెలిసినట్లు స్థలపురాణంలో పేర్కొన్నట్లు భక్తుల విశ్వాసం. వీటికి ఆధారభూతంగా నల్లగట్టుగుట్టపై స్వామివారి పాదుకలు, కోనేరులున్నాయి. ఆ కోనేరులో నీటిని పరిశీలించి చూస్తే ఏ కాలంలోనైనా నీటి మట్టం ఒకేలా ఉండడం ఈ స్థల విశేషం. కొంతకాలం తరువాత స్వామివారికి నల్లగట్టుగుట్ట ప్రాంతం అనుకూలంగా లేకపోవడంతో అక్కడి నుంచి ఎర్రగట్టుగుట్టపై ఒక సొరికెలో వెలిసాడని భక్తుల ప్రగాడ విశ్వాసం. ఈ క్రమంలో ఈ ప్రాంతాన్ని పాలించే ఓ రాజుకు శ్రీనివాసుడు కలలో కనిపించి నేను ఎర్రగట్టుగుట్టపై ఒక సొరికెలో వెలిసానని నాకు గుడి కట్టించాలని కోరినట్లు ప్రచారం. వెంటనే రాజు స్వామివారి కోసం ప్రత్యేకంగా గుట్ట కింద గుడిని కట్టించి నిత్యం పూజలు చేసేవారని మరో కకథనం కూడా ఉంది. అప్పటి నుంచి ఎర్రగట్టుగుట్టపై వెలిసిన స్వామివారిని దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించుకునేవారని ప్రతీతి.
హోళీ పర్వదినం నుంచే జాతర
ఏటా హోళీ పర్వదినం రోజు నుంచే ఎర్రగట్టు జాతర కొనసాగుతూ వస్తోంది. హోళీ రోజున ప్రారంభమై ఐదు రోజుల పాటు జాతర ఉత్సవ వేడుకలు జరుగుతాయి. హౌళృ పర్వదినం సాయంత్రం హసన్‌పర్తి, భీమారం గ్రామాల ఆలయాల నుంచి శ్రీఅలివేలు మంగమ్మ పద్మావతి సమేత శ్రీనివాసుడి ఉత్సవ విగ్రహ ప్రతిమలతో ఊరేగింపుగా గుట్టకు చేరుకుంటాయి. జాతరలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శ్రీవారి కళ్యాణ మండపంలో వేదపండితుల మంత్రోచ్చరణలతో కళ్యాణాన్ని నిర్వహించడంతో జాతర వేడుకలు ప్రారంభమవుతాయి. హౌళీ పర్వదినంతో ప్రారంభమై ఐదురోజుల పాటు శ్రీవారి బ్రహ్మౌత్సవాలను వైభవోపేతంగా నిర్వహిస్తారు.
ఉమ్మడి గ్రామాల నుంచి ఉత్సవమూర్తుల ఊరేగింపు
శ్రీఎర్రగట్టు వెంకటేశ్వరస్వామి దేవాలయం హసన్‌పర్తి రెవెన్యూ శివారులో ఉండగా స్వామివారి జాతర ప్రాంగణం భీమారం రెవెన్యూ శివారులో ఉంది. దీంతో ఇరుగ్రామాల ప్రజలు ఉమ్మడిగా జాతర వేడుకలను నిర్వహిస్తారు. హౌళీ పర్వదినం నుంచి ఐదు రోజుల పాటు జరిగే శ్రీవారి బ్రహ్మౌత్సవ వేడుకలకు హసన్‌పర్తి, భీమారం గ్రామాల దేవాలయాల్లోని వెంకటేశ్వరస్వామి, అలివేలు మంగమ్మ పద్మావతి సమేత శ్రీనివాసుడి ఉత్సవ మూర్తులను ఎర్రగట్టుగుట్టకు తీసుకువస్తారు. హసన్‌పర్తి నుంచి పెద్ద రథచక్రాల బండి మీద, భీమారం నుంచి చిన్న రథ చక్రాల బండి మీద ఉత్సవమూర్తులను మేళతాళాలతో ఊరేగింపుగా సాయంత్రం 5 గంటల వరకు ఎర్రగట్టుగుట్టకు తీసుకువచ్చే ఆనవాయితీ కొనసాగుతోంది. ఇరు గ్రామాల నుంచి తీసుకొచ్చిన ఉత్సవమూర్తులను జాతర ప్రాంగణంలోని కళ్యాణ మండపంలో రాత్రి 10-41 గంటలకు హస్తానక్షత్రయుక్త వృశ్చిక లగ పుష్కరాంశ సుముహూర్తమున శ్రీస్వామివారి కళ్యాణం నిర్వహించడంతో జాతర ఉత్సవాలు ప్రారంభమవుతాయి. కళ్యాణోత్సవం మొదటి రోజు ఆదివారం రాత్రి వివిద గ్రామాల నుంచి భక్తులు పెద్ద చక్రముల బండ్లలో జాతర ప్రాంగణానికి చేరుకొని ద్వజస్తంభం చుట్టూ ప్రదిక్షణలు చేసి స్వామివారి కళ్యానాన్ని చూసి తరించి మొక్కులు చెల్లించుకుంటారు. 19న మేకలు, గొర్రెలు, పోతులతో చిన్న రథచక్రాల బండ్లతో గుట్టకు చేరుకొని స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. 20న స్వామివారికి విశేషపూజ, కుంకుమార్చనలు, హారతి, స్రసాద వినియోగము, 21నక్షీరాభిషేకం, అర్చనలు, 22న ఉత్సవ మూర్తుల ప్రతిమలు ఇరు గ్రామాలకు తీసుకొని వెల్లడంతో జాతర ఉత్సవాలు ముగుస్తాయి.
ఏర్పాట్లు పూర్తి : లక్ష్మణ్‌యాదవ్, చైర్మెన్
వివిద ప్రాంతల నుంచి జాతరకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు దేవస్థానం చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్, ఆలయ కార్యనిర్వాహణాధికారి కిషన్‌రావు తెలిపారు. భక్తుల కోసం ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కరీంనగర్-హన్మకొండ ప్రధాన రహదారిపై ఉండడంతో హన్మకొండ బస్టాండు నుంచి జాతరకు ప్రాంగణం వరకు ఆర్టీసీ వారు ప్రత్యేకంగా బస్సులను నడిపిస్తున్నారని తెలిపారు. దేవాలయ ప్రాంగణంలో టీటీడీ కళ్యాణ మండపంతో పాటు నవగ్రహాలు, శివాలయం, అభయాంజనేయస్వామి ఆలయం, గోశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కేశకండన కోసం ప్రత్యేక స్థలం, జాతర మొదటి రోజున నిర్వహించే కళ్యాణోత్సవంలో పాల్గొనే భక్తుల కోసం ప్రత్యేకంగా టికెట్ కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
పోలీసు బందోబస్తు
ఐదు రోజుల పాటు జరిగే జాతర వేడుకల కోసం ఆలయ నిర్వాహకులు బారీ ఏర్పాట్లు చేశారు. తాగునీటితో పాటు రాత్రి వేళలో గుట్టపైకి వెళ్లే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేకంగా వీధి దీపాలను ఏర్పాటు చేసారు. గుట్టపైకి మెట్లు ఎక్కే క్రమంలో భక్తులకు ఏవిధమైన ఆటంకాలు కలుగకుండా ప్రత్యేకంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. జాతర ప్రాంతంలో దొంగతనాల నివారణతో పాటు పోకిరీల ఆగడాలను అరికట్టేందుకు ప్రత్యేకంగా పోలీసు నిఘాను పెంచారు. మఫ్టీలో పోలీసు గస్తీని ఏర్పాటు చేసినట్లు ఇన్స్పెక్టర్ జనార్దన్‌రెడ్డి తెలిపారు. భక్తులకు ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు వెంటనే వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు జాతర ప్రాంగణంలో వైద్య శిభిరాలను ఏర్పాటు చేశారు.