Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
నవతెలంగాణ-సుబేదారి
'మన ఊరు-మన బడి' కార్యక్రమంలో ఎంపిక చేసిన పనులు త్వరిగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అధికారులతో మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 'మన ఊరు-మన బడి' కార్యక్రమంలో ఇప్పటికే ఎంపిక చేయబడ్డ పాఠశాలల్లో పనులను ఈనెల 31 నాటికి 50 శాతం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాఠశాలల కమిటీ, దాతల బ్యాంక్ అకౌంట్ చేసి వివరాలు సమర్పించాలని చెప్పారు. బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ విషయంలో ఇబ్బందులుంటే ఎల్డీఎం, బ్యాంక్ అధికారులను సంప్రదించాలని సూచించారు. పాఠశాలల్లో కొన్ని ప్రతిపాదిత పనులు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా నిర్వహించాలని చెప్పారు. ప్రజాప్రతినిధులు, కమిటీలు, ఇంజనీరింగ్, సంబంధిత శాఖల సిబ్బంది పనులు గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్య రాణి, ఆర్డీఓ వాసుచంద్ర, డీఆర్డీఓ పీడీ శ్రీనివాస్ కుమార్, డీఈఓ రంగయ్య నాయుడు, సీపీఓ సత్యనారాయరెడ్డి, డీఐసీ జీఎం హరిప్రసాద్, మైనార్టీ సంక్షేమ అధికారి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
క్యాన్సర్‌పై అవగాహన అవసరం : కలెక్టర్
క్యాన్సర్‌పై ప్రజలకు అవగాహన అవసరమని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. కలెక్టరేట్లో టీజీఓల సహకారంతో ఓమేగా బన్ను ఆస్పత్రి ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ రాజీవగాంధీ హనుమంతు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు టీజీఓల సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ ఎన్నమనేని జగన్మోహన్రావు అధ్యక్షత వహించగా కలెక్టర్ మాట్లాడారు. ప్రతీ ఒక్కరు క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ముఖ్యంగా మహిళలు స్క్రీనింగ్ చేయించుకొని క్యాన్సర్ నుంచి బయటపడొచ్చని చెప్పారు. జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యా రాణి మాట్లాడుతూ శిబిరంలో నిర్వహిస్తున్న పరీక్షల ద్వారా క్యాన్సర్ వ్యాధులున తొలి దశలో గుర్తించే అవకాశం ఉందన్నారు. ఒమేగా బన్ను ఆస్పత్రి ఎండీ డాక్టర్ చరణ్‌జిత్‌రెడ్డి, అంకాలజిస్ట్ డాక్టర్ నిఖిల్ కుమార్ క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ శ్రీనివాస్ కుమార్, డీఎంహెచ్ఓ డాక్టర్ లలితా దేవి, రెడ్ క్రాస్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబెర్, బన్ను ఆరోగ్యదా సేవా సమితి డైరెక్టర్ ఈవి శ్రీనివాస్, టీజీఓ నాయకులు మురళీధర్‌రెడ్డి, డాక్టర్ ప్రవీణ్‌కుమార్, ట్రెసా అధ్యక్షుడు రాజ్‌కుమార్, క్లాస్-4 ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు దాస్యానాయక్, మాధవరెడ్డి, సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.