Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 31వ డివిజన్ కార్పొరేటర్ మామిండ్ల రాజు
నవతెలంగాణ-హనుమకొండ
31వ డివిజన్లోని స్థానిక సమస్యలను పరిష్కరించేలా అభివృద్ధి పనులు చేపట్టాలని మేయర్ గుండు సుధారాణి, మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్యలను కార్పొరేటర్ మామిండ్ల రాజు కోరారు. డివిజన్లో మేయర్, కమిషనర్లతో కలిసి కార్పొరేటర్ మంగళవారం పర్యటించారు. తొలుత మెయిన్ రోడ్, సూర్జీత్నగర్, తదితర ప్రాంతాలను సందర్శించారు. సూర్జీత్ నగర్లో తాత్కాలిక పనుల కోసం రూ.38 లక్షల మంజూరు చేశారు. అనంతరం స్థానిక ప్రభుత్వ పాఠశాలను, స్మశానవాటికను పరిశీలించారు. సాగునీటి సరఫరా సరిగా లేని విషయాన్ని గుర్తించి పైపులైన్ చేశారు. అదేవిధంగా డివిజన్లో ఉన్న స్మశాన వాటికలను కూడా వారు పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ రాజు మాట్లాడారు. కార్పొ రషన్లో విలీనమై దశాబ్దాలు గడుస్తున్నా అభివృద్ధి జరగడం లేదన్నారు. న్యూ శాయంపేట మెయిన్ రోడ్లో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. డివిజన్లోని ప్రకృతి వనాల్లో, వైకుంఠధామాల్లో కనీస వసతులు లేవని చెప్పారు. అనంతరం మేయర్ సుధారాణి, కమిషనర్ ప్రావీణ్య మాట్లాడారు. డివిజన్లో నెలకొన్న అన్ని సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో సిటీ ప్లానర్ బానోతు వెంకన్న నాయక్, సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, సీహెచ్ఓ సుజాత, డిప్యూటీ కమిషనర్ రవీందర్ యాదవ్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్‌రావు, డీఈ సంతోష్ బాబు, ఏఈ అరవింద, శానిటరీ ఇన్స్పెక్టర్ కరుణాకర్, జవాన్ ఇంద్రసేన, తదితరులు పాల్గొన్నారు.