Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు వేల్పుల సారంగపాణి
నవతెలంగాణ-హనుమకొండ
ఈనెల 28, 29 తేదీల్లో తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు వేల్పుల సారంగపాణి కోరారు. పెట్రోల్ బంక్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) ఆధ్వర్యంలో హనుమకొండ లష్కర్ బజార్‌లోని విశ్వేశ్వర పెట్రోల్ బంక్ యాజమాని మదన్ మోహన్‌రావుకు బుధవారం సార్వత్రిక సమ్మె నోటీసును అందజేశారు. ఈ సందర్భంగా సారంగపాణి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం దుష్టపాలన సాగిస్తోందని విమర్శించారు. జాతీయత, దేశభక్తి గురించి కబుర్లు చెబుతూ ఆచరణలో విధ్వంసకర విధానాలను అమలు చేస్తోందని విమర్శించారు. జాతీయ సహజ వనరులను, ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతోందని మండిపడ్డారు. సామాన్య ప్రజలపై భారాలు మోపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్, ఇతర నిత్యావసర సరుకుల ధరలు పెంచి ప్రజలపై పెనుభారం మోపిందని ధ్వజమెత్తారు. పార్లమెంట్లో కార్మిక, రైతాంగ వ్యతిరేక చట్టాలను నిరంకుశంగా ఆమోదించిందని తెలిపారు. కార్మిక, ప్రజాఉద్యమాలపై ఉక్కుపాదం మోపుతోందన్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో సామాజిక సంక్షేమానికి కోత పెట్టిందని చెప్పారు. సామాన్యులపై భారాలు మోపుతూ సంపన్నులకు రాయితీలిస్తున్న కేంద్ర ప్రభుత్వ తప్పుడు విధానాలపై పోరాటాలు తప్పవని స్పష్టం చేశారు. కేంద్ర కార్మిక, ఉద్యోగ సంఘాల జాతీయ ఫెడరేషన్ పిలుపు మేరకు సార్వత్క్రి సమ్మెలో కార్మికులందరూ పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో పెట్రోల్ బంక్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు మంద యాక నారాయణ, ప్రధాన కార్యదర్శి కాసబోయిన కొమురయ్య, నాయకులు వెంకట్, సతీష్, రాజు, కల్పన, మహబూబ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.