Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడ
అవగాహన కలిగి ఉంటేనే బీటీని అంతం చేయగలమని ఎంపీఓ సత్యనారాయణ తెలిపారు. మండలంలోని పోగుళ్లపల్లి గ్రామంలో బుధవారం కళాజాత నిర్వహించారు. టీబీ నిర్మూలన కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీఓ సత్యనారాయణ హాజరై మాట్లాడారు. దగ్గినా, తుమ్మినా నోటికి గుడ్డ లేదా రుమాలు అడ్డంగా పెట్టుకోవాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయొద్దని తెలిపారు. అధిక ప్రోటీన్లు కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవాలని, వ్యాధిగ్రస్తులున్న ఇంట్లో ఆరేండ్లలోపు పిల్లలుంటే వారికి వైద్యుడి సలహా మేరకు మందులను ఇప్పించాలని సూచించారు. వ్యాధిగ్రస్తులు మందులు వాడుతున్న సమయంలో రియాక్షన్ ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని చెప్పారు. ఒకరి నుంచి ఒకరికి సోకే అత్యంత ప్రమాదకరమైన వ్యాధిగా అభివర్ణించారు. వ్యాధి నివారణకు ప్రస్తుతం అత్యాధునిక వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ప్రాథమిక దశలోనే గుర్తిస్తే నివారణ అత్యంత సులువని స్పష్టం చేశారు. మందులు వాడకంలో రోగులు నిర్లక్ష్యం వీడాలని హితవు పలికారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్ వెంకట్, టీబీ సూపర్వైజర్ భాస్కర్, సర్పంచ్ అజ్మీరా మంగమ్మ రవి, కార్యదర్శి కళ్యాణి, హంస రమాదేవి, సుజాత, అంగన్వాడీ టీచర్లు లక్ష్మీ, లలిత, రజిత, ఏఎన్ఎంలు అరుణ, విజయ, ఆశ కార్యకర్తలు జ్యోతి, మంజుల, సుశీల తదితరులు పాల్గొన్నారు.