Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
నవతెలంగాణ-భూపాలపల్లి
వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో మిషన్ భగీరథ ఇంట్రా, గ్రిడ్ అధికారులతో సమావేశం నిర్వహించి తాగునీటి సరఫరాపై సమీక్షించి కలెక్టర్ మాట్లాడారు. నీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉన్న గ్రామాలను ముందస్తుగా గుర్తించి మిషన్ భగీరథ నీరు సక్రమంగా సరఫరా అయ్యేలా చూడాలన్నారు. గత సంవత్సరం నీటి ఎద్దడిని ఎదుర్కొన్న గ్రామాల్లో సమస్య పునరావృతం కాకుండా చూడాలన్నారు. మిషన్ భగీరథ నీటి సరఫరా చివరిలో ఉన్న ఆయా గ్రామాల్లో నీటి సరఫరాకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. మిషన్ భగీరథ ఏఈలు అన్ని గ్రామాలు పర్యటించి సమస్యలు గుర్తించి సరిచేయాలన్నారు. పాత తాగునీటి పైప్లైన్ లకు బదులుగా మిషన్ భగీరద పైపుల ద్వారానే నీరు సరఫరా చేయాలన్నారు. ప్రతి ఒక్కరికి ప్రతి రోజూ 100 లీటర్ల నీరు సరఫరా చేస్తున్నామని, అవి సరిపోవడం లేదని ఎవరైనా అడిగితే ఎంపీఓ, సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులు, వార్డ్ మెంబర్ల సమక్షంలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. నూతన గృహాలకు తాగునీరు సరఫరాకు చర్యలు చేపట్టాలన్నారు. ములుగు మిషన్ భగీరథ ఈఈ పరిధి భూపాలపల్లి మండలంలోని గుర్రంపేట, పరిసర 13 గ్రామాలకు సక్రమంగా తాగునీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. తాడిచర్ల గ్రామంలో త్రాగునీటి సరఫరాలో సమస్యలపై పరిశీలించి నివేదిక అందించాలని జిల్లా పంచాయతీ అధికారి ఆశాలతను ఆదేశించారు. అంతకుముందు మిషన్ భగీరథ ఇంజనీర్లు మాట్లాడారు. భూపాలపల్లి డివిజన్లలోని ఆరు గ్రామాలు, మంథని డివిజన్లోని ఒక గ్రామం మిషన్ భగీరథ నీటి సరఫరాలో చివరి గ్రామాలుగా ఉండడంతో తాగునీటి సరఫరా తలెత్తు తుందే తప్ప మిగతా అన్ని గ్రామాల్లో నల్లాల ద్వారా తాగునీరు సరఫరా జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ ఇంట్రా ఇఇ నిర్మల, డీఇలు మధు కుమార్, రమేష్, ఏఈలు, గ్రిడ్ డీఇలు పరమేశ్వరి, కిరణ్ కుమార్, ఏఇ తదితరులు పాల్గొన్నారు.