Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాటారం
కాళేశ్వర-ముక్తేశ్వర ఎత్తిపోతల పథకం పనులు వెంటనే ప్రారంభించాలనే లక్ష్యంతో నేడు కాటారంలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సదస్సు నిర్వహిస్తున్నట్లు మాల భేరి తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ పీక కిరణ్ తెలిపారు. శుక్రవారం కాటారంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలకుల నిర్లక్ష్యంతో కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు చిన్న చూపుకు గురవుతున్నదన్నారు. మహదేవ్పూర్ మండలం బీరసాగర్ గ్రామంలో శ్రీకాళేశ్వర ముక్తేశ్వర ఎత్తిపోతల పథకం (చిన్న కాలేశ్వరం) ప్రాజెక్టుకు 2008లో శంకుస్థాపన చేశారని, నాలుగు మండలాల్లో తాగునీరు,45 వేల ఎకరాల వ్యవసాయ భూములకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో రూ.499 కోట్ల23లక్షలతో చేపట్టారని తెలపారు. ఇప్పటికైనా అధికార పార్టీ స్పందించి ప్రాజెక్ట్ పునర్ప్రారంభించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఐదు మండలాల రైతులతో ముఖా ముఖి కార్యచరణతో పాటు రైతుల పక్షాన ఎంతటి పోరాటానికైనా సిద్ధమని అన్నారు. రూ.లక్షా 80 కోట్లతో నిర్మించిన మేడిగడ్డ ప్రాజెక్టు దీనివల్ల ఈ ప్రాంత వాసులకు గుంట భూమికి కూడా నీరందించలేదనానరు. భూములు త్యాగం చేస్తే ఇక్కడి రైతులకు నీరు ఇవ్వకుండా వేరే చోటికి తరలించే కార్యక్రమాలు చేపడుతున్నారని ఆరోపించారు. నేడు ఐదు మండలాల ప్రజా సంఘాల నాయకులు, రైతులు, ప్రజలు, వివిధ పార్టీల ప్రతిపక్ష నాయకులతో సమావేశం ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. అందరూ అధిక సంఖ్యలో రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు, తుడుం దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షులు కుడిమేత సమ్మయ్య, ప్రజా సంఘాల నాయకులు బూడిద తిరుపతి, విడుదల ప్రసాద్, ఎమ్మార్పీఎస్ నేత మోతే సాంబయ్య, యువైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు బాపు, తదితరులు పాల్గొన్నారు.