Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇదీ తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్ పనితీరు
నవతెలంగాణ-జనగామ రూరల్
పేద ల ఆరోగ్య పరిరక్షణకు 60 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేసేందుకు తెలంగాణ డయాగస్టిక్స్ సెంటర్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ, పరీక్షల కేంద్రం పనితీరును పర్యవేక్షించాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలొస్తున్నాయి. రక్త నమూ నాలు సేకరించిన వారం రోజులకు రిపోర్టులు ఇస్తుండడంతో దిక్కు తోచక ఉన్నామని బాధితులు ఆవేదన చెందుతున్నారు. రక్త నమూనాలు స్వీకరించిన రోజే సాయంత్రానికి రిపోర్టులు అందజేస్తారు. కానీ, జనగామ తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్లో మాత్రమే రిపోర్టులు ఇవ్వడానికి వారం రోజుల సమయం పడుతుండడం గమనార్హం. వైద్యవిధాన పరిషత్ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా ఆస్పత్రి ఎదురుగా జనగామ జిల్లా కేంద్రంలో తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఇందులో నాలుగైదు రకాల పరీక్షలతోనే సరిపెడు తున్నారు. షుగర్ పేషెంట్లకు అత్యవసర పరీక్షలు సరిగా చేయట్లేదు. ఈ విషయాన్ని సిబ్బంది దృష్టికి తీసుకెళ్లగా సరైన వసతులు లేవని చెప్పడం గమనార్హం. ఇటీవల జనగామ మండలం చౌడారం గ్రామానికి చెందిన మారగోని రమేష్ వివిధ పరీక్షల కోసం జిల్లా ఆస్పత్రిలో వైద్యున్ని సంప్రదించగా షుగర్ పరీక్షలు, లివర్ పరీక్షలు, లిపిడ్ ప్రొఫైల్ తదితర వైద్య పరీక్షలు రాశారు. తెలంగాణ డయాగ్నోస్టిక్ కేంద్రంలో రక్తనమూనాలు ఇవ్వగా రిపోర్టు ఇవ్వడానికి దాదాపు వారం రోజులు పట్టింది. ఇదే విషయమై జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్, సెంటర్ ఇన్చార్జి డాక్టర్ సుగుణాకర్ రాజును వివరణ కోరగా పరీక్షలు చేసేందుకు అవసరమైన సిబ్బంది కొరత ఉన్న మాట వాస్తవమేనని చెప్పారు. నాణ్యమైన యంత్రాలు మరింతగా రావాల్సి ఉందని చెప్పారు. అన్ని వసతులు సమకూరిన తర్వాత సకాలంలో వైద్య పరీక్షలు అందించేందుకు కృసి చేస్తామనడం గమనార్హం.