Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వెంకటాపురం
మండలం కేంద్రంలో శ్రీ వెంకటేశ్వరస్వామి తిరుకళ్యాణ మహోత్సవం ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త రాజా రాఘవ రంగరాజు ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు అర్చకుల మంత్రోచ్ఛారణలు, భక్తజన జయజయ ధ్వానాల నడుమ కన్నుల పండువగా నిర్వహించారు. కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే కాకుండా ఛత్తీస్ఘడ్, మహారాష్ట్ర నుంచి వేలాదిగా తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. సూదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల కోసం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో చలువ పందిల్లు, తాగునీటి, విద్యుత్, ఇతర సౌకర్యాలు కల్పించారు. భక్తజన సందోహంతో మండల కేంద్రంలో సందడి నెలకొంది. జాతరకు వచ్చిన జనం కోసం సాయి భక్తమండలి ఆధ్వర్యంలో తాగునీటి సౌకర్యం కల్పించారు. ఆలయ ప్రాంగణంలో మహిళ మండలి అధ్వర్యంలో వాటర్ బాటిల్లు, లడ్డూలను పంచిపెట్టారు. ఓడ బలిజా సేవా సంఘం ఆధ్వర్యంలో భక్తులకు పులిహోర ప్యాకెట్లు అందించారు. టీఆర్ఎస్ మాజీ నేత బాలసాని ముత్తయ్య జ్ఞాపకార్ధం అతడి మిత్రులు ఆలయం ఎదుట అన్నదానం నిర్వహించారు. తిరు కళ్యాణం తిలకించేందుకు వచ్చిన భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. స్వామి వారి కళ్యాణానికి వెంకటాపురం సొసైటీ అధ్యక్షుడు చిడెం మోహన్రావు, నూగూరు మార్కెట్ కమిటీ చైర్మెన్ బోదెబోయిన బుచ్చయ్య, జెడ్పీటీసీ పాయం రమణ, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జి తెల్లం వెంకట్రావు, గుడపాటి శ్రీనివాసరావు, ఎంపీపీ చెరుకూరి సతీష్, వెంకటాపురం సర్పంచ్ చిడెం యామిలి, బీసీ మర్రిగూడెం సర్పంచ్ అట్టం సత్యవతి, ఆలుబాక సర్పంచ్ పూజారి ఆదిలక్ష్మి, ఓడ బలిజ సేవా సంఘం నాయకులు తోట మల్లికార్జునరావు, డిరా దామోదర్, బొల్లె సునిల్, గ్రామస్తులు వేల్పూరి లక్ష్మినారాయణ హాజరయ్యారు.