Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంట మార్పిడితోనే రైతులకు లాభాలు
- భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
నవతెలంగాణ-శాయంపేట
యువత వ్యవసాయం వైపు దృష్టి సారించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆకాంక్షించారు. పంట మార్పిడి చేస్తే రైతులకు లాభాలుంటాయని ఆయన చెప్పారు. సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. భవిష్యత్ తరాలు, యువత అధునాతన టెక్నాలజీని వినియోగించి వ్యవసాయం చేసి అధిక లాభాలు గడించాలని సూచించారు. వ్యవసాయ, ఉద్యాన పంటలు, వాటి ఆధార పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల పరిశీలన కోసం మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలోని షిరిడీ సమీపంలోని ద్రాక్ష, జామ తోటలను వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డిలతో కలిసి గండ్ర వెంకటరమణారెడ్డి శుక్రవారం సందర్శించి పరిశీలించారు. ఆ ప్రాంతంలోని వర్షపాతం వివరాలు, పంటల రకాలు, సాగునీటి వసతి, పంటల మార్కెటింగ్‌పై రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మాట్లాడారు. రైతు కష్టానికి తగిన ఫలితం దక్కాలంటే దేశంలో ఏ పంట ఎంత అవసరమో తెలుసుకుని సాగు చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తోందని విమర్శించారు. దేశాన్ని పంట కాలనీలుగా అభివద్ధి చేసుకొని, పంటల సాగుకు మార్గదర్శకం చేయాలని సూచించారు. టీఆర్ఎస్ ఏడేళ్ల పాలనలో వ్యవసాయ స్వరూపం పూర్తిగా మారిపోయిందని తెలిపారు. రైతులు పంటల మార్పిడితో అధిక లాభాలు గడించాలని సూచించారు. సీఎం కేసీఆర్ రైతు సంక్షేమం కోసం అనేక పథకాలు, కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పారు.