Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలతో ఆగ్రహం
- గ్రామాలవారీగా కమిటీల ఏర్పాటు
- ఉద్యమానికి సమాయత్తం
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
ల్యాండ్ పూలింగ్‌కు భూములు ఇచ్చేది లేదని రైతులు తేల్చి చెబుతున్నారు. వరంగల్, హన్మకొండ జిల్లాల్లో 'కుడా' ఆధ్వర్యంలో చేపట్టిన ల్యాండ్ పూలింగ్‌కు ఎట్టిపరిస్థితుల్లో భూములు ఇవ్వమని రైతులు స్పష్టం చేస్తున్నారు. శనివారం మంత్రి కేటీఆర్ వరంగల్ పర్యటనలో ల్యాండ్ పూలింగ్‌కు భూములిస్తే లాభమని, ప్రైవేటు వెంచర్లను ఎవరు ఆపుతారు ? దాని కంటే 'కుడా' ల్యాండ్ పూలింగ్ లాభదాయకమని వ్యాఖ్యానించడం రైతుల్లో ఆగ్రహం తెప్పించింది. గ్రామాలవారీగా ఐక్యకార్యచరణ కమిటీలను ఏర్పాటు చేసుకొని మరీ ఎదురయ్యే సవాళ్లను ధీటుగా ఎదుర్కొవడానికి రైతులు సమాయత్తమవుతున్నారు. ఈ కమిటీలకు టిఆర్ఎస్లో వున్న నేతలే ముందు భాగాన నిలవడం గమనార్హం.
ఆరేపల్లిలో ప్రారంభమైన రైతుల ఆందోళన విలీన గ్రామాల్లో విస్తరిస్తుంది. టిఆర్ఎస్ పార్టీలో కీలకంగా పనిచేసిన నేతలు సైతం ల్యాండ్ పూలింగ్ను వ్యతిరేకించడం గమనార్హం. త్వరలో ల్యాండ్ పూలింగ్‌కు వ్యతిరేక ఉద్యమాన్ని రైతులు ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కాకతీయ అర్భన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) ల్యాండ్ పూలింగ్ కోసం ఇచ్చిన నోటిఫికేషన్లతో రైతులు పోరాటానికి సన్నద్ధమవుతున్నారు. వరంగల్ మండలం ఆరేపల్లి గ్రామంలో మొదటి రైతులు ల్యాండ్ పూలింగ్ను నిరసిస్తూ జాతీయ రహదారిపై ఆందోళనకు దిగిన విషయం విదితమే. ఈ ఆందోళన గ్రేటర్ పరిధిలోని విలీన గ్రామాల్లో విస్తరించి రోజుకో ఆందోళన జరుగుతుంది. ఆదివారం రాంపూర్ గ్రామంలో రైతు ఐక్య కార్యచరణ కమిటీ సమావేశం టిఆర్ఎస్ గ్రామ మాజీ అధ్యక్షుడు దేశినేని హన్మంతరావు నేతృత్వంలో జరిగింది. ఈ సమావేశంలో ల్యాండ్ పూలింగ్‌కు భూములు ఇవ్వమని రైతులు తీర్మానం చేశారు. ఇదిలావుంటే ఆరేపల్లిలో ల్యాండ్ పూలింగ్ను వెంటనే నిలిపివేయాలని గ్రామ రైతులు ధర్నా చేశారు. తాజాగా గీసుగొండ మండలంలోని మొగిలిచర్ల, పోతరాజుపల్లి, గొర్రెకుంట, కొత్తపేట గ్రామాలకు చెందిన రైతులు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటి ముందు ఆందోళనకు దిగిన విషయం విదితమే. అనంతరం వరంగల్ కలెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వడమే కాకుండా 'కుడా' కార్యాలయం ముందు ధర్నా చేసి ప్లానింగ్ అధికారి అజిత్‌రెడ్డికి సైతం వినతిపత్రం ఇచ్చారు. దీంతో విలీన గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్‌కు వ్యతిరేకంగా రైతులు తమ వ్యవసాయ భూములను ఇవ్వడానికి నిరాకరించడమే కాకుండా ఈ మేరకు పోరాటానికి సిద్ధమవుతున్నారు.
ల్యాండ్ పూలింగ్ వ్యతిరేక పోరాటం ..?
'కుడా' ల్యాండ్ పూలింగ్‌కు నోటిఫికేషన్ విడుదల చేయడంపై రైతులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఆరేపల్లి గ్రామంలో మొదలైన ఈ ఆందోళన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనమైన విలీన గ్రామాలకు విస్తరిస్తుంది. ఇప్పటికే ఆరేపల్లి, రాంపూర్ గ్రామాల్లో రైతు ఐక్యకార్యాచరణ కమిటీలు ఏర్పడ్డాయి. ఈ కమిటీలు మున్ముందు విలీన గ్రామాల్లో విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మంత్రి కేటీఆర్ వ్యాఖ్యల కలకలం
తాజాగా వరంగల్‌లో పర్యటించిన టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ల్యాండ్ పూలింగ్‌కు భూములు ఇస్తే రైతులకు అధిక లాభం ఉంటుందని వ్యాఖ్యానించారు. ప్రైవేటు వెంచర్లను ఆపలేనప్పుడు, 'కుడా' ఆధ్వర్యంలో భూ సేకరణ చేసి లే అవుట్ ప్లాటింగ్ చేసి విక్రయిస్తే రైతులకు, ఇటు 'కుడా' అధిక లాభాలు కలుగుతాయని వ్యాఖ్యానించడం రైతుల్లో చర్చనీయాంశంగా మారింది.
రాంపూర్‌లో రైతు ఐక్య కార్యచరణ కమిటీ
కాజీపేట మండలం రాంపూర్ గ్రామంలో రైతులు ఐక్యకార్యచరణ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఈ కమిటీకి దేశినేని హనుమంతరావు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. 'దేశినేని' టిఆర్ఎస్కు రాంపూర్ గ్రామ శాఖధ్యక్షుడిగా పనిచేశారు. ఆదివారం రైతులంతా సమావేశం ఏర్పాటు చేసుకొని ల్యాండ్ పూలింగ్‌కు భూములు ఇచ్చేది లేదని తీర్మానం చేశారు.
ఆరెపల్లిలో రైతుల ధర్నా
వరంగల్ మండలం ఆరేపల్లి గ్రామంలో ఆదివారం ల్యాండ్ పూలింగ్ను నిలిపివేయాలని రైతు ఐక్య కార్యచరణ కమిటీ నేతృత్వంలో రైతులు ధర్నా చేశారు. 'కుడా' ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్‌తో ముందు మేల్కొని ఉద్యమబాట పట్టింది ఆరేపల్లి రైతులే. సర్వే చేయకుండా పలుమార్లు అధికారులను రైతులు అడ్డుకున్నారు.
గీసుగొండ మండలంలో..
గీసుగొండ మండలంలోని మొగిలిచర్ల, పోతరాజుపల్లి, గొర్రెకుంట, వరంగల్ మండలంలోని కొత్తపేట, ఆరేపల్లి గ్రామాల రైతులు తాజాగా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటి ముందు నిరసన తెలిపిన విషయం విదితమే. అనంతరం 'కుడా' కార్యాలయం ముందు ధర్నా చేశారు. వరంగల్ కలెక్టర్ గోపికి వినతిపత్రం ఇచ్చారు. రెండు పంటలు పండే భూములను ల్యాండ్ పూలింగ్‌కు ఇవ్వమని, ల్యాండ్ పూలింగ్ను విరమించుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.