Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నగరంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో గుడిసెలు ఏర్పాటు
నవతెలంగాణ-వరంగల్
నగరంలోని ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని, వాటిని రక్షించి పేదలకు పంచాలని సీపీఐ(ఎం) నాయకులు డిమాండ్ చేశారు. బల్దియా పరిధి 43వడివిజన్ తిమ్మాపూర్ క్రాస్, జక్కలొద్ది ప్రభుత్వ భూముల్లో సీపీఐ(ఎం) రంగశాయిపేట ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం సీపీఐ(ఎం) నాయకులు, కార్యకర్తలు, పేద ప్రజలు ఎర్రజెండాలు పాతి గుడిసెలు వేసుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి సీిహెచ్ రంగయ్య పాల్గొని మాట్లాడుతూన... పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇస్తానన్న హామీలు నెరవేర్చ లేదని అన్నారు. 8 ఏండ్లు గడిచిన వరంగల్ నగరంలో ఒక్క పేదోనికి ఇంటి స్థలం ఇవ్వలేదన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకం ప్రజలకు అందుబాటులోకి రాకపోవడంతో ఆగ్రహించి పెద్ద సంఖ్యలో పేదలు ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నారని అన్నారు. వారికి రక్షణ కల్పించి పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే ప్రజల పక్షాన ఉంటారో భూములను కబ్జా చేసిన కబ్జాదారులు చెంత ఉంటారో తేల్చుకోవాలని ఆయన అన్నారు. నగరంలో ప్రభుత్వ స్థలాలు ఒక్కొక్కటి మాయ మవుతుంటే ప్రభుత్వం మాత్రం చోద్యంగా చూస్తోందని అన్నారు. అనంతరం రంగశాయిపేట ఏరియా కమిటీ కార్యదర్శి ఎం సాగర్ మాట్లాడుతూ తిమ్మాపూర్ క్రాస్ రోడ్ సర్వేనెంబర్ 241లో 105 ఎకరాలు ఉండాల్సిన ప్రభుత్వ భూమి 40 ఎకరాలు కూడా లేదని, చెరువు మొత్తం కబ్జా చేసి దర్జాగా ప్లాట్లు చేస్తుంటే రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారని అన్నారు. ప్రస్తుతం ఆరు ఎకరాలు భూమి మాత్రమే మిగిలిందని, ప్రైవేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించిన భూములను కూడా రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకోకుంటే ప్రజలే స్వాధీనం చేసుకుంటారని అన్నారు. జక్క లోద్ధి లోని ప్రభుత్వ భూములు సర్వే నెంబర్లు 102 /1,105/1, 106/1, 107/బి,108/1, 120/1,119/9 121/1,121/2,128/2లో 296 ఎకరాలు ఉండాలని, కానీ, 28 ఎకరాలు మాత్రమే ఉందని అన్నారు. భూమి మొత్తం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో బడా రాజకీయ నాయకుల చేతులో ఉందని, రంగశాయిపేట శివారు సర్వే నెంబర్లు 180, 181,181లో సుమారు 50 ఎకరాలు ప్రభుత్వ భూములు గుట్టలు రాళ్లు ఉన్నా వాటిని వదిలేయకుండా స్వాహా చేశారని ఆరోపించారు. ఈ భూములని కాపాడి ప్రజలకు ఇవ్వాలని, అప్పటివరకు ప్రజలు తెగింపుతో పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) ఏరియా కమిటీ సభ్యులు డి సాంబమూర్తి, ఎం ప్రత్యుష, ఎం జ్యోతి, టి రత్న, లక్క రమేష్, జి ఓదేలు, సీహెచ్ ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.