Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరంగల్ రూరల్ జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి
నవతెలంగాణ-శాయంపేట
టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని వరంగల్ రూరల్ జెడ్పీ చైర్పర్సన్, టీఆర్ఎస్ పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి తెలిపారు. మండలంలోని కొత్తగట్టు సింగారం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పెంబర్తి చంద్రమౌళి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించగా పార్టీ సభ్యత్వం వల్ల మంజూరైన రెండు లక్షల రూపాయల చెక్కును చంద్రమౌళి సతీమణి సునీతకు జ్యోతి ఆదివారం అందజేశారు. అనంతరం ఆరెపల్లిలో ఇటీవల విద్యుత్ ప్రమాదంలో అగ్నికి ఆహుతైన మొక్కజొన్న పంటలను ఆమె సందర్శించి పరిశీలించారు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందేలా చూస్తామని భరోసా ఇచ్చారు. హుస్సేన్పల్లిలోని పాఠశాలలో 'మన ఊరు-మన బడి' కార్యక్రమంలో భాగంగా రూ.4 లక్షలతో చేపడుతున్న అభివృద్ధి పనులను ఆమె ప్రారంభించారు. మైలారం, పెద్దకొడపాక గ్రామాల్లో పీఏసీఎస్, ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మండలంలోని గ్రామాల్లో మరణించిన, గాయపడ్డ కార్యకర్తలను పరామర్శించారు. ఆమె వెంట ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంగుల మనోహర్‌రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు దుంపల శ్రీలత మహేందర్‌రెడ్డి, అరికిళ్ల ప్రసాద్, అబ్బు ప్రకాష్‌రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మెన్ తిరుపతిరెడ్డి, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.