Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
నవతెలంగాణ-శాయంపేట
రాష్ట్రంలో పర్యటిస్తున్న వ్యక్తులు, శక్తులు రాజకీయ లబ్ధి కోసమే రైతాంగం పట్ల డిక్లరేషన్ అనౌన్స్ చేస్తున్నట్లు ప్రకటించి మొసలి కన్నీరు కారుస్తున్నట్టు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఎద్దేవా చేశారు. అధికారంలో కొనసాగుతున్న రెండు రాష్ట్రాల్లో రైతు సంక్షేమ పథకాలను అమలు చేసి ఇక్కడ మాట్లాడాలని ప్రతిపక్ష నేతలకు ఆయన సవాల్ విసిరారు. మండలంలోని పత్తిపాక గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం వరంగల్ రూరల్ జిల్లా జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి తో కలిసి ఎమ్మెల్యే పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగ వాతావరణంలో జరుపుతున్నట్లు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా చివరి ఆయకట్టకు సాగునీరు అందించి, బీడు భూములను పంట పొలాలుగా మార్చి అన్నపూర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్దారని ఆన్నారు. 29 రాష్ట్రాలలో అమలుకాని రైతు సంక్షేమ పథకాలు రైతు బీమా, రైతు బంధు, రుణమాఫీ, 24 గంటల కరెంటు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. రైతు సంక్షేమం తో పాటు విద్య, వైద్య రంగానికి ప్రాధాన్యతనిస్తూ,1700 కోట్ల రూపాయలను వైద్య రంగానికి కేటాయించినట్లు గుర్తుచేశారు. మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన వసతులు కల్పిస్తూ పాఠశాలలను అభివద్ధి చేస్తున్నట్లు తెలిపారు. భూపాల్ పల్లి జిల్లా కేంద్రానికి మెడికల్ కళాశాల మంజూరు చేసినట్లు తెలిపారు. దళిత బంధు ద్వారా ఒక్కో కుటుంబానికి 10 లక్షల సహాయం ప్రభుత్వం అందజేస్తోందని, భూపాలపల్లి నియోజక వర్గం లో మొదటి విడతలో వంద కుటుంబాలకు పథకం అందజేసినట్లు తెలిపారు. నిరుద్యోగుల కోసం సీఎం కేసీఆర్ ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేశారని, ఈ ఏడాది ఉద్యోగ నామ సంవత్సరంగా అభివర్ణించారు. అతి త్వరలో కొత్త పింఛన్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. కొత్త పరిశ్రమల స్థాపన లో సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ వల్ల తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉన్నట్లు కేంద్రం ప్రకటించిందన్నారు. అనంతరం కాట్రపల్లి గ్రామానికి చెందిన కౌసల్యకు మంజూరైన 16 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ మెతుకు తిరుపతి రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ కుసుమ శరత్, వైస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, పర్కాల ఏఎంసీ వైస్ చైర్మెన్ మారేపల్లి నందం, సర్పంచ్ చిట్టిరెడ్డి రాజిరెడ్డి, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గంగుల మనోహర్ రెడ్డి, ఎంపీడీవో ఆమంచ కష్ణమూర్తి, తహసిల్దార్ చలమల్ల రాజు, ఏఓ గంగా జమున, ఏఈఓ స్టెల్లా, నాయకులు, రైతులు పాల్గొన్నారు.