Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ నేతల గుండెల్లో రైళ్ల పరుగు
- కాంగ్రెస్ జాతీయ నేత, ఎమ్మెల్యే సీతక్క
నవతెలంగాణ-హనుమకొండ చౌరస్తా
తెలంగాణలో రాహుల్ గాంధీకి వస్తున్న ప్రజాదారణ చూసి ఓర్వలేక విమర్శలు చేసిన మంత్రి కేటీఆర్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని ఏఐసీసీ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ రైతు సంఘర్షణ సభను చూసి టీఆర్ఎస్ నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని ఆమె అన్నారు. హన్మకొండలోని కాంగ్రెస్ భవన్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రైతు సంఘర్షణ సభ విజయవంతం చేసిన ప్రతీ ఒక్కరికి కతజ్ఞతలు తెలిపారు. టీఆర్ఎస్ సర్కారు ప్రజలకు రాజరిక పాలన ఎలా ఉంటుందో చూపిస్తోందని మండిపడ్డారు. ప్రధానమంత్రిగా అవకాశం వచ్చినా త్యాగం చేసిన రాహుల్‌ను విమర్శించే స్థాయి కేటీఆర్‌కు లేదన్నారు. రాజులా ఉండే జీవితాన్ని వదులుకున్న మహోన్నత వ్యక్తిగా రాహుల్ గాంధీని కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు జీవితాన్ని త్యాగం చేసిన విద్యార్థుల ముందు మీరెంత అంటూ కేటీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. గడచిన ఎనిమిదేండ్లలో ఒక్కసారైనా అమరవీరుల కుటుంబాలను పరామర్శించారా? అంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్యే కాగానే కేటీఆర్ మంత్రి అయ్యారని చెప్పారు. పదవుల కోసం ఆరాటపడే కేటీఆర్ లాంటి వ్యక్తులకు రాహుల్ గాంధీతో పోలికెక్కడదని మండిపడ్డారు. వరంగల్‌కు పదేపదే వచ్చే కేటీఆర్‌ను ఎన్నికల టూరిస్టులు కాదా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ నేతలు బీజేపీతో కలిసి ఆడిన డ్రామాలో రైతులు బలయ్యారని చెప్పారు. నడ్డా సభ పెడితే ఎందుకు విమర్శించరని ప్రశ్నించారు. రహస్య ఒప్పందం ఏంటో చెప్పాలన్నారు. రాహుల్ సభకు వచ్చిన స్పందన చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. పీకే ఇచ్చిన రిపోర్ట్‌తో టీఆర్ఎస్ నేతల్లో భయం మొదలైందన్నారు. రాష్ట్రంలో మంత్రుల పరిస్థితి ఏంటో ప్రజలందరికి తెలుసన్నారు. రేవంత్‌రెడ్డిని గాడ్సేతో పోల్చే నికష్ట స్థితిలో కేటీఆర్ ఉన్నారని చెప్పారు. రాజకీయ లబ్దికోసం చేసే జిమ్మిక్కులు మానుకోవాలని హితవు పలికారు. ముఖ్యమంత్రి కాకుండానే హోదా అనుభవిస్తున్న కేటీఆర్ రాహుల్ గాంధీఫై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. రాహుల్ గాంధీ ఏం తప్పు చేశారని క్షమాపణ చెప్పాలని ప్రశ్నించారు. రాహుల్ డమ్మీ కాదు నిబద్ధత గల నాయకుడని తెలిపారు. రాహుల్ గాంధీకి ఎడ్లు, వడ్లు తెలియదనడం దుర్మార్గమన్నారు. వరంగల్‌లో ఎయిర్ పోర్టు రాలేదు కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా నడుస్తోందని మండిపడ్డారు. మాస్టర్ ప్లాన్ లేకుండా నగరాభివద్ది ఎలా సాధ్యమని ప్రశ్నించారు. కాంగ్రెస్‌పై ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. వర్ధన్నపేట నియోజకవర్గ కోఆర్డినేటర్ నమిండ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ వరంగల్ డిక్లరేషన్‌తో రైతులకు భరోసా ఇచ్చిన రాహుల్ గాంధీ సభను ఓర్వలేకే కేటీఆర్ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. అనంతరం మదర్స్ డే సందర్బంగా ఎమ్మెల్యే సీతక్కను, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణను, టీపీసీసీ అధికార ప్రతినిధి కూచన రవళిరెడ్డిని, జిల్లా మహిళా అధ్యక్షురాలు బంక సరళను శాలువాతో నమిండ్ల శ్రీనివాస్ సన్మానించారు. కార్యక్రమంలో వరంగల్ వెస్ట్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బంక సంపత్, జిల్లా ఓబీసీ సెల్ చైర్మెన్ బొమ్మతి విక్రమ్, ఎస్సీ సెల్ చైర్మెన్ పెరుమాండ్ల రామకృష్ణ, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కొత్తపల్లి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.