Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ జిల్లా కార్యదర్శి రమేష్ రాజా
నవతెలంగాణ-పాలకుర్తి
జనగామ జిల్లాకు మంజూరైన అడిషనల్ జూనియర్ సివిల్,జుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టును పాలకుర్తిలో ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చొరవ చూపాలని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ జిల్లా కార్యదర్శి మామిండ్ల రమేష్ రాజా కోరారు. శుక్రవారం నియోజకవర్గ కేంద్రం పాలకుర్తిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ జనగామ జిల్లాలో రెండవ పట్టణంగా అభివద్ధి చెందుతున్న పాలకుర్తిలో అడిషనల్ జూనియర్ సివిల్, జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఏర్పాటు అత్యంత అవసరమని తెలిపారు. రెవెన్యూ డివిజన్ కేంద్రంగా అభివద్ధి చేయడంలో పాలకుర్తికి అన్యాయం జరిగిందని, ప్రస్తుతం జిల్లాకు మంజూరైన అడిషనల్ జూనియర్ సివిల్, జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టును ఏర్పాటు చేయడం ద్వారా అధికార వికేంద్రీకరణ జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కోర్టు పరిధిలోకి పాలకుర్తి, కొడకండ్ల, జఫర్గడ్, స్టేషన్ ఘన్ పూర్, చిల్పూర్ మండలాలు వస్తాయని, కోర్టు సంబంధించిన అకామినేషన్ కల్పిస్తే ఏర్పాటు చేసే అవకాశం ఉందని అన్నారు. లేదంటే జనగామ గానీ, మరో చోటుకి తరలి పోయే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి మాన్యపు బుజేందర్, జిల్లా నాయకులు జీడి సోమయ్య, అఖిల భారత ప్రగతిశీల మహిళ సంఘం జిల్లా కార్యదర్శి అనంతోజు రజిత, లిబరేషన్ పాలకుర్తి పట్టణ కార్యదర్శి దుస్సా శివ ప్రసాద్, గ్యార కుమారస్వామి, సారయ్య పాల్గొన్నారు.