Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 27, 30 తేదీల్లో నిరసనలు
నవతెలంగాణ-మహబూబాబాద్
ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా పోరాడాలని వామపక్షాలు నిర్ణయించాయి. ఈనెల 25 నుంచి 31 వరకు జిల్లావ్యాప్తంగా నిరసనలు నిర్వహించనున్న క్రమంలోనే 27న మండల కేంద్రాల్లో, 30న జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు వామపక్ష పార్టీలు ప్రకటించాయి. జిల్లా కేంద్రంలోని పెరుమాండ్ల జగన్నాధం భవన్లో ఆదివారం నిర్వహించిన వామపక్ష పార్టీల సమావేశంలో నిత్యావసర సరుకుల, భూముల రిజిస్ట్రేషన్, విద్యుత్, ఆర్టీసీ ఛార్జీల పెంపుపై చర్చించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్, సీపీఐ జిల్లా కార్యదర్శి విజయసారథి, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ డివిజన్ కార్యదర్శి లింగ్యా, ప్రజాపంథా జిల్లా నాయకుడు ఉమ్మగాని సత్యనారాయణ మాట్లాడారు. ఈనెల 25 నుంచి 31 వరకు 3 విడతలుగా అందోళన, పోరాటాలు చేయనున్నట్టు చెప్పారు. ఈ క్రమంలోనే 27న మండల, పట్టణ కేంద్రాల్లో, 30న జిల్లా కేంద్రంలో ధర్నా చేస్తామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసర సరుకుల ధరలతోపాటు రిజిస్ట్రేషన్, విద్యుత్, రవాణా ఛార్జీలు ఇష్టారీతిన పెంచుతున్నాయని చెప్పారు. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలపై మోయలేని భారాలు పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్పై సెస్సులను రద్దు చేయాలని, నిత్యావసర సరుకులపై జీఎస్టీని తగ్గించాలని, స్టీల్, సిమెంట్, ఇసుక ధరలను నియంత్రించా లని, అసంఘటిత రంగ కార్మికులకు నెలకు రూ.7,500లు చొప్పున చెల్లించాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని ప్రజలను కోరారు. సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా నాయకులు ఆకుల రాజు, సమ్మెట రాజమౌళి, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వెలుగు శ్రావణ్, న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు దేశెట్టి రామచంద్రయ్య, శివారపు శ్రీధర్, జిల్లా నాయకులు బాబు, ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి బిల్లకంటి సూర్యం తదితరులు పాల్గొన్నారు.