Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-దామెర
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గత ఏడాది మిర్చికి అధికంగా గిరాకీ ఉందని మిర్చిపంట వైపు రైతులు మొగ్గు చూపారు. హనుమకొండ జిల్లాలోని దామెర మండలంలో రైతులు మిర్చిని కొంతమేరకు సాగు చేశారు. మండలవ్యాప్తంగా 14 గ్రామాలకు 11 గ్రామాల్లో 128 మంది రైతులు 258 ఎకరాలలో పంటను వేశారు. రైతులు ఎక్కువగా హైబ్రిడ్ వంగడాలు 341, తేజ రకాలను ఎంచుకోగా ముందుగా మిర్చినారు పోసి 26 రోజుల తర్వాత నాటారు. నాటిన తర్వాత కొద్ది రోజుల్లోనే మొక్కలు గీడాసపారిపోవటం, ఆకుముడత, పేనుబంక, ఎర్రనల్లి, నల్ల తామర తెగుళ్లు సోకాయి. ఎన్ని మందులు పిచికారి చేసినా ఆకుముడత ఎక్కువగా సోకి పూత, కాత లేకుండా పోయింది. ఎకరాల కొద్దీ పంట వేసిన కొన్ని కాయలు కూడా రాలేదు. వీటికి తోడు అధిక వర్షాలు, వాతావరణం కూడా అనుకూలించక పోవడంతో ఎన్ని మందులు పిచికారి చేసినప్పటికీ లక్షల రూపాయల పెట్టుబడి పెట్టడా అప్పులు భారీగా పెరిగిపోయాయి తప్ప పంటలు మాత్రం కోలుకోలేదు. డిసెంబర్ వరకు పంటను కొనసాగించినా ఫలితం లేకపోవడంతో కొద్దిపాటి రైతులు నీటివసతి ఉన్న చోట తీసివేసి వేరే పంటను వేశారు. ఇలా అధిక పెట్టుబడులు పెట్టి అప్పులపాలై ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభుత్వపరంగా గానీ ఇతర రకంగా తమకు నష్టపరిహారం అందలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు.
వాతావరణం అనుకూలించక నష్టం : ఏవో శ్వేత
మండలంలోని రైతులు వేసిన మిర్చి తోటలకు ఈ ఏడాది ఆకుముడత, నల్ల తామర తదితర తెగుళ్లు సోకడంతో పాటు అధిక వర్షాలు వాతావరణం అనుకూలించక మిర్చి పంటలకు తీవ్రంగా నష్టం జరిగింది. రైతులు పెట్టిన పెట్టుబడి కూడా నష్టపోయారు. వీరికి ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయం అందలేదు.