Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మట్టెవాడ
ఇండ్లు లేని పేదలకు తొలగించిన గుడిసెల స్థానంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యురాలు నలిగంటి రత్నమాల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు అనేక హామీలు గుప్పించి ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చి తదనంతరం విస్మరిస్తున్నాయని విమర్శించారు. సర్వేనెంబర్ 249లోని ప్రభుత్వ భూమిలో పార్టీ శివనగర్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో పేదలు వేసుకున్న గుడిసెలను రెవెన్యూ అధికారులు, పోలీసులు గుడిసెలను తొలగించడాన్ని నిరసిస్తూ ప్రజలు ఖిలావరంగల్ తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసనా ప్రదర్శన నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా రత్నమాల మాట్లాడారు దశాబ్దాలుగా నిలువ నీడ కోసం లక్షల్లో పేదలు దరఖాస్తు చేసుకోగా ఏ ప్రభుత్వాలు కూడా నిరుపేదలకు ఇండ్లను పూర్తిస్థాయిలో కట్టించలేదన్నారు. వరంగల్ తూర్పులో 5 లక్షల 50 ఎకరాల మిగులు భూమి ఉందని ఆ భూములు పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. జీవో 58 ప్రకారం 120 గజాల స్థలం, ఇల్లు నిర్మించి ఇస్తామన్న ప్రభుత్వం వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పేదలు లక్షల్లో నివాస సముదాయాలు కోసం దరఖాస్తు చేయగా ఏ ఒక్కరికి డబుల్ బెడ్ రూం ఇవ్వలేదన్నారు. పేదల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రభుత్వం ఇల్లులు ఇవ్వకపోవడంతో సహనం కోల్పోయి ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేస్తే వాటిని తొలగిస్తున్నప్పటికీ స్పందించకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. తహసీల్దార్ ఇచ్చిన హామీ మేరకు వారం రోజుల్లో ప్రభుత్వ స్థలాల్లో పేదలకు స్థలాలు కేటాయించాలని లేనిపక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్థలాలను తిరిగి ఆక్రమించుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం ఏరియా కమిటీ మెంబర్లు సుతారి సారంగపాణి, నలిగంటి అనిల్, వి.దుర్గయ్య, ఆవుల ఉదరు, పి.భవాని, లత, రామ, తదితరులు పాల్గొన్నారు.