Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డబ్బు చెల్లింపులో తీవ్ర జాప్యం
నేటికీ రూ.141.11 కోట్లు పెండింగ్
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరంగల్, హన్మకొండ, జనగామ, భూపాలపల్లి జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయి. ఈ నాలుగు జిల్లాల్లో 6.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించినా, ఇప్పటి వరకు కేవలం 2.15 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారు. మరో 4.44 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉంది. ఇందులో లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ప్రస్తుతమున్నా మరో 3.44 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇంకా కొనుగోలు చేయాల్సి ఉంది. రైతులకు ఇప్పటికీ రూ.141.11 కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ధాన్యం కొనుగోలు కేంద్రాలను మేగానీ, జూన్ మొదటి వారంలో మూసివేసే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో లక్ష్యానికి ఆమడదూరంలో ధాన్యం కొనుగోళ్లుండడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నాలుగు జిల్లాలు వరంగల్, హన్మకొండ, జనగామ, భూపాలపల్లి జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు లక్ష్యానికి ఆమడదూరంలో ఉన్నాయి. కొనుగోలు కేంద్రాలు అధికంగా తెరిచినా, చాలా కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు జరగడం లేదు. హన్మకొండ జిల్లాలో 1.40 లక్షల మెట్రిక్ టన్నులకుగాను 66 వేల 211 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు.
లారీల కొరతతో ఇబ్బందులు
వరంగల్ జిల్లాలో 166 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినా, కేవలం 121 కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలో 1.65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఇందులో ఇప్పటి వరకు 3,399 మంది రైతుల నుండి 31 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. మరో 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే వుండింది. జిల్లాలోని వర్ధన్నపేట, రాయపర్తి మండలాల్లో లారీల కొరత తీవ్రంగా వుంది. ఈ రెండు మండలాల్లో 80 లారీలు అవసరముంటే కేవలం 40 లారీలు మాత్రమే అందుబాటులో వున్నాయి. దీంతో సకాలంలో కేంద్రాల నుండి ధాన్యాన్ని మిల్లులకు తరలించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది.
రూ.62.50 కోట్లు చెల్లించాల్సి ఉంది..
హన్మకొండ జిల్లాలో 158 కొనుగోలు కేంద్రాలుండగా 12 వేల 769 మంది రైతుల నుంచి 66 వేల 211 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. 1.40 లక్షల మెట్రిక్ టన్నులకుగాను 66 వేల 211 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారు. రూ.129.75 కోట్లకుగాను ఇప్పటివరకు రూ.67.25 కోట్లను రైతులకు చెల్లించారు. మరో 62.50 కోట్లను రైతులకు సర్కార్ చెల్లించాల్సి ఉంది.
మరో 1.69 లక్షల మెట్రిక్ టన్నులు కొనాల్సిందే..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనగామ జిల్లాలోనే ధాన్యం కల్లాలకు ముందు చేరుతుంది. అయినా కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతోంది. జిల్లాలో మరో 1.69 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉంది. ఆ జిల్లాలో 179 కొనుగోలు కేంద్రాలుండగా 2.75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటివరకు 16 వేల 500 మంది రైతుల నుంచి లక్షా 6 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. రైతులకు రూ.2.03 కోట్లను చెల్లించాల్సి ఉండగా కేవలం రూ.1.42 కోట్లను మాత్రమే చెల్లించారు.
రూ.22 కోట్లు చెల్లించాల్సిందే..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 213 ధాన్యం కొనుగోలు కేంద్రాలుండగా 80 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇందులో 113 కేంద్రాల ద్వారా 12 వేల 149 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా మరో 68 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనాల్సి ఉంది. అలాగే రైతులకు రూ.23 కోట్లకుగాను రూ.1.10 కోట్లు మాత్రమే చెల్లించారు. మరో రూ.22 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉంది.