Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యక్తిని తప్పించేందుకు ప్రయత్నం
- చక్రం తిప్పుతున్న ఓ అధికారపార్టీ నాయకుడు !
నవతెలంగాణ-గణపురం
మండలంలోని చెల్పూర్ కాకతీయ ధర్మల్ విద్యుత్ కేంద్రం ప్రధాన గేటు ముందు నిర్మించిన బస్ షెల్టర్‌ను కూల్చివేసిన ఘటనలో రాజకీయరంగు అలుముకుంది. బస్ షెల్టర్లు కూల్చివేసిన వ్యక్తిని తప్పించేందుకు ఓ అధికార పార్టీ నాయకుడు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కాగా గణపురం పోలిస్ స్టేషన్ లో తహసీల్ధార్ సతీష్ కుమార్ గుర్తుతెలియని వ్యక్తి కూల్చివేశాడంటూ ఫిర్యాదు చేశాడు. 2018లో అప్పటి స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి సింగరేణి నిధులతో వివిధ గ్రామాలలో బస్ షెల్టర్లను నిర్మించాడు. ఇదే క్రమంలో కేటీపీపీ ప్రధాన గేటు ముందు కూడా బస్ షెల్టర్ నిర్మించారు. అప్పటినుండి ఇప్పటివరకు ఉన్న బస్ షెల్టర్ రెండు రోజుల క్రితం కూల్చివేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బస్ షెల్టర్ నేషనల్ హైవే రోడ్డు పై నిర్మించారు. దీనికి ఆనుకొని వెనకాల ఓవ్యక్తి కి చెందిన పట్టా భూమి ఉంది. అతను దుబారు లో ఉంటూ వారం రోజుల క్రితం స్వగ్రామం చేరుకున్నట్లు సమాచారం. ఆయనే కూల్చివేశారంటూ గ్రామ ప్రజలు పేర్కొంటున్నారు. కూల్చి వేసిన వ్యక్తి ఒక అధికార పార్టీ నాయకున్ని కలుసుకుని కేసును పక్కదోవ పట్టించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. కాగా అధికారులు కూడా గుర్తు తెలియని వ్యక్తి కూల్చివేశాడంటూ ఫిర్యాదు చేయడం గమనార్హం. వాస్తవానికి బస్టాండ్ సమీపంలో సీసీ కెమెరాలు ఉన్నాయి. వాటిని పరిశీలిస్తే కూల్చివేసిన జేసీబీతోపాటు ఎవరు కూల్చారనేది స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి బస్ షెల్టర్ కూల్చివేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.