Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- కోల్ బెల్ట్
భూపాలపల్లి ఏరియాలోని కేటికె-8 ఇంక్లైన్ లో ప్రైవేట్ కాంట్రాక్టు ఎస్డీఎల్ యంత్రాలను నడిపే అవకాశం స్థానిక నిరుద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు మాత్రమే ఇవ్వాలని సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్(ఐఎన్టీయూసీ) భూపాలపల్లి బ్రాంచ్ ఉపాధ్యక్షులు జోగ బుచ్చయ్య డిమాండ్ చేశారు. బుధవారం జయశంకర్ జిల్లా కేంద్రంలోని సంఘం కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం కేటికె -8 ఇంక్లైన్ లో ప్రైవేట్ కాంట్రాక్టు ఎస్డిఎల్ యంత్రాలకు అండర్ గ్రౌండ్ లో ఆపరేటర్లుగా స్థానికులకు అవకాశం ఇవ్వాలని, సింగరేణి కార్మికుల పిల్లలకు మొదటి అవకాశం ఇవ్వాలని అన్నారు. సింగరేణిలో సర్వీస్ చేసి ఎస్డీఎల్ ఆపరేటర్‌గా రిటైర్మెంట్ కార్మికులకు అవకాశమివ్వాలన్నారు. స్థానికులకు ఇవ్వకుండా ఇతరులకు పెడితే ఉద్యమాలు, ధర్నాలు, రాస్తారోకోలు, దీక్షలు చేపడతామని హెచ్చరించారు. ఈ క్రమంలో సంస్థకు ఎలాంటి ఇబ్బంది కలిగినా, ఉత్పత్తిక అంతరాయం ఏర్పడినా యాజమాన్యం, ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ జనరల్ సెక్రటరి అండెం రఘుపతి రెడ్డి, సెంట్రల్ సెక్రెటరి సిహెచ్ సదయ్య, బ్రాంచ్ సెక్రెటరి సిరంగి రాజయ్య, బి అశోక్, బి మధుకర్ రెడ్డి, బి రాములు, పి రవికిరణ్, కె వేణుగోపాల్, ఎస్ భాస్కర్, ఎస్ సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.