Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్హర్రావు
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న అంబేద్కర్ పేరును కోనసీమ జిల్లాకు పెడితే తప్పేంటని, అంబేద్కర్ పేరును వ్యతిరేకించడం సిగ్గు చేటని ప్రజాసంఘాల నాయకులు పీక కిరణ్,అక్కల బాపు యాదవ్ మండిపడ్డారు. బుధవారం మండలంలోని కొయ్యూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు అంబేద్కర్ పేరును కోనసీమ జిల్లాకు పెట్టడాన్ని సహించలేని అరాచక శక్తులు విధ్వంసాలు సష్టించడం దారుణమని అన్నారు. విధ్వంసాలకు పాల్పడిన వారిని, వారి వెనుక ఉన్న శక్తులను తక్షణమే గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కోనసీమకు డా బి. ఆర్. అంబేద్కర్ గారి పేరు పెట్టాలని స్థానిక అన్ని వర్గాల ప్రజలు,దళిత సంఘాలతో పాటు అన్ని రాజకీయ పార్టీలు కూడా డిమాండ్ చేసాయన్నారు. అంబేద్కర్ పేరు పెట్టిన తరువాత ఆ పేరును వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేయడం వెనక కుట్రలు జరుగుతున్నాయన ఆరోపించారు. నూతనంగా ఏర్పడిన వివిధ జిల్లాలకు అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, వైఎస్సార్,అల్లూరి అన్నమయ్య , పొట్టి శ్రీరాములు, ప్రకాశం పేర్లు పెడితే లేని అభ్యంతరం అంబేద్కర్ పేరు పెడితేనే ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించి మంత్రి విశ్వరూప్ ఎమ్మెల్యే సతీష్ ఇండ్లపై దాడులు చేసిన వారిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలన్నారు. ప్రభుత్వం అంబేద్కర్ పేరు విషయంలో వెనక్కి తగ్గితే దళితులు , పీడితులు సహించరని అన్నారు. ఈ కార్యక్రమంలో బుర్రి శివరాజు, మోతే సాంబయ్య పాల్గొన్నారు.