Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మట్టెవాడ
ప్రభుత్వాలు భూ సీలింగ్ చట్టం తీసుకువచ్చి భూమి లేని నిరుపేదలకు ప్రభుత్వ మిగులు భూములు పంచాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి చింత మల్ల రంగయ్య అన్నారు. ఖిలావరంగల్ ఏరియా క్లాసులు, రాజకీయ, శిక్షణ తరగతులను బుధవారం ఏసిరెడ్డినగర్ రఘునాథ్ భవన్లో నిర్వహించారు. జిల్లా కార్యవర్గ సభ్యులు నలిగంటి రత్నమాలతో కలిస ఆయన పాల్గొని మాట్లాడారు. దేశ వ్యాప్తంగా 6 కోట్ల 30 లక్షల ఎకరాల్లో మిగులు భూములు ఉన్నాయని, వాటిని పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. పేదల భూములను పెట్టుబడిదారులకు ధారాదత్తం చేస్తున్న ప్రభుత్వాలు పేదల ఇంటి కోసం స్థలాన్ని కేటాయించకపోవడం దుర్మార్గమన్నారు. నిలువ నీడ కోసం ఖిలా వరంగల్ మండలం సర్వే నెంబర్ 249 లో 400 మంది గుడిసెలు వేసుకుంటే అర్క్యలాజికల్ భూములు అంటున్న అధికారులు అదే సర్వేనెంబర్ లో ఎకరంన్నర భూమిని అశ్వశాలలకు ఎలా కేటాయించారని ప్రశ్నించారు. ప్రభుత్వ స్థలాలను దర్జాగా రియల్టర్లు భూ కబ్జాదారులు హస్త గతం చేసుకుంటుంటే పట్టించుకోని ప్రభుత్వం జానెడు జాగా లేని నిరుపేదలు గుడిసెలు వేసుకుంటే వాటిని తగలబెట్టడం సరికాదన్నారు. ప్రభుత్వం ఎన్ని ఇబ్బం దులు పెట్టినా పేదలకు నిలువ నిడ దక్కే వరకు పోరాడుతామని హెచ్చరించారు. సీపీఐ(ఎం) కార్యవర్గ సభ్యులు సింగారపు బాబు మాట్లాడుతూ... పేదలందరికీ, ప్రభుత్వ మిగులు భూములను ఇళ్ల స్థలాలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఏరియా కమిటీ సభ్యులు సుతారి సారంగపాణి, ఆవుల ఉదరు, గరు మల్లయ్య, టి భవాని, నలిగంటి తిరుపతి, రజినీకాంత్ సుమలత, రమ, లత, తదితరులు పాల్గొన్నారు.