Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
జాతీయ ఉపాధి హామీ పనులు చేసిన కూలీలకు పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి బుర్రి ఆంజనేయులు డిమాండ్ చేశారు. బుధవారం మండలంలోని లక్నెపెల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట వ్యకాస ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు పూనుకున్నదన్నారు. కూలీలకు పనిదినాలు కల్పించడంలో, వెనువెంటనే వేతనాలు చెల్లించడంలోనూ తీవ్ర జాప్యం చేస్తుందన్నారు. మూడు నెలలు గడిచినా పనులు చేసిన కూలీలకు వేతనాలు ఇవ్వకుంటే ఎలా కుటుంబాలను పోషించుకుంటారని ప్రశ్నించారు. రోజుకు రూ.257 దినసరి వేతనం గిట్టుబాటు అయ్చేలా కల్పించాల్సి ఉండగా రూ.50, 70 కి మించి కేటాయించడం లేదన్నారు. వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిట్టుబాటు పనిదినాలు, వెనువెంటనే వేతన చెల్లింపు, పని ప్రదేశాలల్లో మంచినీటి, నీడ వంటి కనీస సౌకర్యాలు కల్పించడానికి తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేకపోతే వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో కూలీలను సమీకరించి తీవ్ర ఆందోళనలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. దళిత బంధు, ఇండ్ల స్థలాలు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఆసరా పింఛన్ పథకాల అమలులో పారదర్శకత పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యకాస నాయకులు ఎండీ.కతీఫ్, సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు కొరబోయిన కుమారస్వామి, కత్తి కట్టయ్య, రామపురం రవి, మేట్లు తదితరులు పాల్గొన్నారు.