Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి
నవతెలంగాణ-జనగామ
ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ తక్షణమే విడుదల చేసి, వేసవిలో చేపడతామన్న హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని టీఎస్‌యూ టీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి డిమాండ్ చేశారు. గురువారం పట్టణంలో టీఎస్‌యూటీఎఫ్ జనగామ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పి చంద్రశేఖర్ రావు అధ్యక్షతన నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో చావ రవి మాట్లాడారు. 2021 మార్చి 22న, 2022 మార్చి 10 తేదీల్లో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపడతామని ప్రకటించారని, విద్యామంత్రి సైతం వేసవి సెలవుల్లో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపడతామని హామీ నిచ్చారని గుర్తు చేశారు. కానీ, వేసవి సెలవులు ప్రారంభమై నాలుగు వారాలు గడిచినా షెడ్యూల్ విడుదల చేయలేదన్నారు. ఈ ఏడాది కూడా పదోన్న తులు, బదిలీలు ఉంటాయా ఉండవా ? అనే సందిగ్ధంతలో ఉపాధ్యాయులు ఉన్నారన్నారు. నాన్ గెజిటెడ్ టీచర్ పోస్టులను ఇంటిగ్రేటెడ్ జిల్లా క్యాడర్‌గా ప్రకటించటంపై హైకోర్టులో పిల్ దాఖలైందన్నారు. తాత్కాలికంగా స్కూల్ అసిస్టెంట్, ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్, హైస్కూలు హెడ్మాస్టర్ పోస్టులకు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు, విద్యాశాఖ పరిధిలోని జిల్లా పరిషత్, మండల పరిషత్ ఉపాధ్యాయులకు వేర్వేరుగా పదోన్నతులు ఇవ్వటానికి అవకా శాలు ఉన్నాయని అన్నారు. పైస్థాయి పర్యవేక్షణాధికారి పోస్టులను కామన్ సీనియారిటీ గానీ, క్యాడర్ స్ట్రైంగ్త్ రేషియోలో రోస్టర్ నిర్ణయించి పదోన్నతులు కల్పించటానికి అవకాశాలను పరిశీలించాలన్నారు. కోర్టు కేసులు ఉంటే తుది తీర్పుకు లోబడి సమీక్షించే విధంగా షరతులతో కూడిన పదోన్నతులు ఇవ్వవ చ్చని అన్నారు. జీఓ 317 అమలుతో ఏర్పడిన సీనియారిటీ, స్పెషల్ క్యాటగిరీ సమస్యలు, భార్యాభర్తల అప్పీల్స్, పరస్పర బదిలీ దరఖాస్తులు అన్నీ సత్వరమే పరిష్కరించాలన్నారు. ఉద్యోగుల నెల వేతనాలను ప్రతినెలా మొదటి తేదీన విడుదల చేయాలని కోరారు. సప్లిమెంటరీ బిల్లుల విడుదల్లో జాప్యాన్ని నివారించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి మడూరి వెంకటేష్ పాల్గొన్నారు.