Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మంగపేట
మండలంలోని తిమ్మంపేట శివారులోని కోడలు చెరువు పంట పొలాల్లోని రైతుల మోటార్ల కోసం ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్లోని విలువైన రాగి వైర్‌ను, కరెంట్ ఆయిల్‌ను గుర్తుతెలియని దుండగులు దొంగిలించారు. ఈ ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. రైతు దంతనపల్లి పురుషోత్తం కథనం ప్రకారం.. కోడలు చెరువులోని అతడి పంట పొలాన్ని ఖరీఫ్ దుక్కులకు సిద్దం చేసేందుకు స్థానిక ట్రాక్టర్ యజమానులకు చెప్పి బంధువుల ఇంట్లో వివాహానికి వెంకటాపురం వెళ్లగా శుక్రవారం ఉదయం పొలం దున్నేందుకు ట్రాక్టర్ వెళ్ల చోరీ వెలుగులోకి వచ్చింది. దుండగులు పొలంలోని ట్రాన్స్ఫార్మర్ను గద్దె నుంచి దించి దాన్ని పగులగొట్టి అందులోని రాగి వైరు, కరెంట్ ఆయిల్‌ను దొంగిలించి ట్రాన్స్ఫార్మర్ డబ్బాను, కాసారాలను పొలంలో పడేసి వెళ్లారు. దీంతో పురుషోత్తం స్థానిక విద్యుత్ శాఖ ఏఈఈ, లైన్మెన్లకు సమాచారం ఇచ్చారు. రైతు ఫిర్యాదుతో విద్యుత్ అధికారులు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఫొటోలు, వీడియోలు తీసి ఉన్నతాధికారులకు నివేదించారు. రబీ సీజన్ అనంతరం ట్రాన్స్ఫార్మర్లకు విద్యుత్ సరఫరా నిలిపివేయడంతోనే దొంగలు చోరీకి పాల్పడ్డట్టు తెలుస్తోంది. మండలంలోని వాడగూడెంలోనూ గతంలో రెండు ట్రాన్స్ఫార్మర్లను ఇదే తరహాలో పగులగొట్టి దొంగతనాలకు పాల్పడ్డట్లు రైతులు తెలిపారు. ట్రాన్స్ఫార్మర్లను పగులగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న, బిల్ట్‌లో వరుస చోరీలకు పాల్పడుతున్న ముఠా ఒకటేనని రైతులు అనుమానిస్తున్నారు.