Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాలా పూడిక తీశారు.. చెత్తను వదిలేశారు.
- వారం రోజులు గడిచిన తొలగించని వైనం
- ఇబ్బందులు పడుతున్న స్థానికులు
నవతెలంగాణ-ఖిలా వరంగల్
ప్రభుత్వం ఓ వైపు పల్లెలను, పట్టణాలను అభివృద్ధి పథంలో నడిపించడానికి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే శుక్రవారం నుంచి నాలుగో విడత పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రజా ప్రతినిధులు ప్రారంభించారు. కానీ నగరంలో అభివృద్ధి గానీ, పారిశుధ్య నిర్వహణ గానీ అస్తవ్యస్తంగా తయారయ్యాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎన్నిసార్లు అధికారులు, ప్రజా ప్రతినిధులకు మొరపెట్టుకున్నా సమస్యలు పరిష్కరించడం లేదని వాపోతున్నారు. ఇందుకు నిదర్శంగా వరంగల్ నగరంలోని శివనగర్ నాలా నిలుస్తోంది. వారం రోజుల క్రితం వరంగల్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఈ నాలా నుంచి పూడిక తీశారు. అనంతరం ఈ చెత్తను మొత్తం రోడ్డుపైనే కుప్పలుగా పోశారు. వారం రోజులు గడిచిన్పటికీ ఎవ్వరూ చెత్తను తొలగించలేదు. ఈ విషయంపై స్థానికులు మాట్లాడుతూ.. అధికారులు, ప్రజా ప్రతినిధులకు మొర పెట్టుకున్న ఎవ్వరూ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. చెత్తను రోడ్డుపైనే వేయడంతో అనారోగ్యాలకు గురవుతున్నట్టు వాపోయారు. ఈ క్రమంలోనే దోమల వ్యాప్తి వీపరితంగా పెరిగి విషజ్వరాల బారిన పడుతున్నట్టు చెబుతున్నారు. వెంటనే పూడిక తీసిన చెత్తను తొలగించాలని స్థానికులు ప్రజా ప్రతినిధులను, అధికారులను కోరుతున్నారు.