Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
'మీరు చేస్తున్న పోరాటం వృథా కాదు. మీకు ఎర్ర జెండా అండగా ఉంటుంది.' అని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు అన్నారు. శుక్రవారం వరంగల్ జిల్లా ఖిలావరంగల్ మండలం జక్కలొద్దిలో గుడిసెవాసుల పోరాటానికి మద్దతు తెలిపి ప్రసంగించారు.
నివేశనస్థలాలు సాధించే వరకు పోరాటం : జి. రాములు
నివేశన స్థలాలు సాధించే వరకు మనం ఈ పోరాటాన్ని ముందుకు తీసుకుపోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు జి. రాములు అన్నారు. దాడులకు సైతం నెరవకుండా మీరు చేస్తున్న పోరాటాన్ని అభినందిస్తున్నట్లు చెప్పారు. ఐక్యంగా పోరాటాన్ని ముందుకు తీసుకుపోతే విజయం మనదేనన్నారు.
ప్రభుత్వ భూమిని ఆక్రమించుకునే హక్కు మనకుంది : సూడి క్రిష్ణారెడ్డి
ప్రభుత్వ భూమిని ఆక్రమించుకునే హక్కు మనకుందని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు సూడి క్రిష్ణారెడ్డి అన్నారు. చావో, రేవో తేల్చుకోవడానికి మనమంతా ఇక్కడ నివేశన స్థలాల కోసం గుడిసెలు వేసుకున్నామని, వాటిని దక్కించుకోవడానికి ఐక్యంగా పోరాడాలన్నారు. మనం జూబ్లీ హిల్స్ భూములు అడగడం లేదని, ప్రభుత్వ భూముల్లో ఇండ్ల స్థలాలు కావాలంటున్నామని, ప్రభుత్వ భూములను లాక్కొనే హక్కు మనకుందన్నారు. ఆడోళ్లపై, నిండు గర్భిణీలపై దాడులు చేయడం ఏమిటి ? అని ప్రశ్నించారు. వాళ్లు ఆడోళ్లకు పుట్టలేదా ? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ నగరంలో 32 కేంద్రాల్లో గుడిసెలు వేసిన చరిత్ర సీపీఐ(ఎం)దేనని అన్నారు.
దాడులకు బెదరం : జగదీశ్
పాలకులు చేయించే దాడులకు బెదరమని, మా పోరాటాన్ని ఉధృతం చేసి నివేశన స్థలాలను సాధిస్తామని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు జగదీశ్ అన్నారు. దాడులను ఎదుర్కొనే ఓపిక మాకుందని, ఎర్రజెండా నీడలో మా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. పాలకులు చేసే కుయుక్తులకు భయపడొద్దని, గత పోరాటాల అనుభవంతో ధైర్యంగా ముందుకు సాగాలన్నారు.