Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆకుల రాజు
నవతెలంగాణ-మహబూబాబాద్
ఆటోడ్రైవర్ల కోసం సంక్షేమ బోర్డ్‌ను ఏర్పాటు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆకుల రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఆ యూనియన్ కార్యాలయంలో గాడిపెల్లి శ్యామ్ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన సమావేశంలో రాజు మాట్లాడారు. ఆటోడ్రైవర్ల సమస్యలు నానాటికీ పెరుగుతున్నాయని చెప్పారు. వారి సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వాలు శ్రద్ధ పెట్టడం లేదని విమర్శించారు. ఆటోడ్రైవర్లకు పోలీసులు, ఆర్టీఏ అధికారుల నుంచి వేధింపులు తలెత్తుతున్నాయని చెప్పారు. పన్నులు, బీమా, తదితరాల పేరుతో ప్రభుత్వానికి భారీగా చెల్లిస్తున్నా ఆటోడ్రైవర్ల ఆదాయం మాత్రం పెరగలేదని తెలిపారు. మోటార్ వెహికల్ చట్టం-2019 వల్ల తీవ్ర నష్టం ఇబ్బందులు ఎదురౌతున్నాయని చెప్పారు. దాన్ని వెంటనే మార్చాలని, ఆటోడ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పట్టణ కన్వీనర్ కుమ్మరికుంట్ల నాగన్న మాట్లాడుతూ ఆటోడ్రైవర్లు ఐక్యంగా ఉంటే సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. అనంతరం కమిటీ అధ్యక్ష, కార్యదర్శులుగా గాడిపల్లి శ్యామ్, దర్గయ్యలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశంలో నాయకులు వేల్పుగొండ రాజు, ముకరంజన్, విజరు, శ్రీను, చేపూరి సాగర్, అనిల్, ఆజాద్, పాషా పాల్గొన్నారు.