Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీ డాక్టర్ తరుణ్ జోషి
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
డబ్బు, బంగారంతో ఉడాయించిన కిలాడీ దంపతులను అరెస్ట్ చేసినట్లు వరంగల్ పోలీసు కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి తెలిపారు. కాలనీ వాసులను మోసం చేసి వారి నుండి డబ్బులు, బంగారాన్ని తీసుకొని ఉడాయించిన కిలాడీ దంపతులను టాస్క్‌ఫోర్స్, కేయూ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. వీరి నుండి రూ.11.80 లక్షలు, 125 గ్రాముల బంగారపు ఆభరణాలను, కారు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ అరెస్ట్‌కు సంబం ధించి వరంగల్ పోలిస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి వివరాలను వెల్లడించారు. అరెస్ట్ అయిన దంపతులు కోమళ్ల కిషోర్, దివ్య హన్మకొండలోని పరిమళకాలనీలో నివాసం వుంటూ చిరు వ్యాపరం చేస్తుండేవారు. ఈ వ్యాపారంలో వారికి లాభాలు రాకపోవడంతో సులభంగా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించాలను కున్నారు. ఇందుకోసం ఈ కిలాడీ దంపతులు తాము నివాసముంటున్న కాలనీవాసులతో స్నేహపూర్వకంగా ఉండేవారు. ఈ దంపతులు తమ ప్రణాళికలో భాగంగా ముందుగా కాలనీ వాసుల వద్ద తమ వ్యక్తిగత అవసరాల కోసం ముందుగా చిన్నమొత్తాల్లో అప్పుగా డబ్బు లేదా బంగారాన్ని తీసుకొని ప్రతిఫలంగా వారికి తీసుకున్న డబ్బుకు పెద్ద మొత్తంలో వడ్డీ చెల్లించే వారు. దీంతో దంపతులు తాము తీసుకున్న డబ్బుకు రెండింతలు డబ్బు తిరిగి అందచేసి కాలనీవాసులను నమ్మించడం ప్రారంభించారు. కాలనీ వాసులకు వీరిపై నమ్మకాన్ని కలిగించే విధంగా ఈ దంపతులు వ్యవహరించారు. తాము అనుకున్న ప్రకారం తమ ప్రణాళికను అమలు చేశారు. ఇందులో భాగంగా కోమళ్ల దివ్య తనకు అత్యవసరంగా బైపాస్ సర్జరీ చేయించుకోవాలని లేదంటే తన ప్రాణానికే ప్రమాదమని కాలనీలోని మహిళలను నమ్మించడంతోపాటు తన చికిత్స కోసం డబ్బు లేదా బంగారాన్ని రుణం ఇచ్చే వారికి అధిక వడ్డీని అందచేస్తానని తెలిపి కాలనీలోని ఆరుగురు మహిళల నుండి సుమారు రూ.43.40 లక్షలతోపాటు 430 గ్రాముల బంగారు ఆభరణాలను తీసుకొని కిలాడి దంపతులు కాలనీ నుండి ఉడాయించారు. దీంతో డబ్బు, బంగారు ఆభరణాలను రుణంగా ఇచ్చిన బాధితులు ఈ దంపతులిద్దరు కాలనీకి రాకపోవడంతోపాటు వార ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ కావడంతో తాము మోసపోయామని గుర్తించారు. పోలీసు కమిషనర్ ఆదేశాల మేరకు కెయుసి పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేయడంతోపాటు పోలీసు కమిషనర్ ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్, కేయూసీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసుల వద్దనున్న టెక్నాలజీని వినియోగించుకొని కిలాడీ దంపతులను గుర్తించడంతోపాటు వారిని అదుపులోకి తీసుకొని విచారించగా, దంపతులిద్దరూ కాలనీ వాసులను మోసం చేసినట్లు అంగీకరించారు. ఈ దంపతులకు సహకరించిన మరో ఇద్దరు మహిళలు అరుణ, మంజుల ప్రస్తుతం పరారీలో వున్నారని తెలిపారు. ఈ కేసులో ప్రతిభ కనపరిచిన టాస్క్‌ఫోర్స్ ఇన్‌ఛార్జి అదనపు డిసిపి వైభవ్ గైక్వాడ్, టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్లు సంతోష్, శ్రీనివాస్, కెయుసి ఇన్స్పెక్టర్లు దయాకర్, ఎస్సైలు లవణకుమార్, సంపత్, ఏఏఓ, సల్మాన్ పాషా, హెడ్ కానిస్టేబుళ్లు సోలింగం, మాధవరెడ్డి, స్వర్ణలత, కానిస్టేబుళ్లు వరాజేశ్, ఆలీ, బిక్షపతి, శ్రీను, రాజు, శ్రవణ్ కుమార్ హౌంగార్డు విజరును పోలీసు కమిషనర్ అభినందించారు.