Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడ
కొత్తగూడ,గంగారం ఏజెన్సీ మండలాలలో అటవీశాఖ అధికారులు 1/70 చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తూ ఆదివాసీ గిరిజన ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లెల కష్ణ ఆరోపించారు. మంగళవారం మండల కేంద్రంలోని స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో సంఘం మండల ఉపాధ్యక్షులు కంగాల సురేందర్ అధ్యక్షతన మండల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లెల కష్ణ మాట్లాడుతూ 1950 కంటే ముందు నుండి సాగులో ఉన్న సాగు భూములలో ట్రెంచ్ లు కొడుతూ ఏజెన్సీ ప్రజలను నిరాశ్రయులను చేస్తున్నారన్నారు. తద్వారా ప్రజలు ఉపాధిని కోల్పోయి రోడ్డున పడే పరిస్థితులు ఏర్పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. చెరువు మట్టిని ఉపాధిహామీ ద్వారా పొలాల్లో వేసుకుందాం అన్నా అటవీశాఖ అధికారులు అడ్డుతగులుతూ చెరువులో తీసిన మట్టిని మళ్లీ చెరువులోనే పోయిస్తున్నారని అన్నారు. పట్టా భూముల్లో వ్యవసాయం కోసం బోర్లు వేసుకుందామన్న అటవీశాఖ అధికారులు రైతులపై దురుసుగా ప్రవర్తిస్తూ ఆ పట్టా భూములను అటవీశాఖలో కలిపామంటూ రైతులను దభాయిస్తూ రైతుల నోట్లో మట్టి కొడుతున్నారని చెప్పారు. స్వయానా తహసీల్ధార్ ఇది రెవెన్యూ పట్టా భూమి అని ధ్రువీకరించిన ప్పటికీ అటవీశాఖ అధికారులు నిర్లక్ష్యపు సమాధానాలు చెబుతూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ఏజెన్సీ ప్రాంతాల్లో అటవీ శాఖ అధికారులు రైతులను ఇబ్బందులకు గురి చేయడం మానుకోకపోతే అటవీ శాఖ కార్యాలయం ముందు ఈ నెల 23,24 వ నిరాహార దీక్ష, ధర్నా చేపడతామని, విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.