Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం
నవతెలంగాణ-జనగామ
జిల్లాలో అక్రమాలకు గురవుతున్న ప్రభుత్వ భూములను అధికారులు గుర్తించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఏదునూరి వెంకట్రాజం డిమాండ్ చేశారు. మంగళవారం జనగామ లోని జిల్లా ప్రజాసంఘాల కార్యాలయంలో సింగారపు రమేష్ అధ్యక్షతన జరిగిన వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో వేలాది ఎకరాల మిగులు భూములు, ప్రభుత్వ, పోరంబోకు, అసైన్డ్ భూములను ప్రజాప్రతినిధులు, పెత్తందార్లు,రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఆక్రమణలో ఉన్నాయని తెలిపారు. గత నాలుగైదు సంవత్సరాలుగా జిల్లాలోని వివిధ మండలాల్లో, జిల్లా కేంద్రాన్ని ఆనుకొని ఇలా ప్రభుత్వ భూములు అన్నింటిని ఆక్రమించుకుంటున్నారని అన్నారు. అనేకమార్లు వివిధ పోరాటాల రూపంలో అధికార యంత్రాంగం దష్టికి తీసుకు వచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోయిందన్నారు. జిల్లా రెవెన్యూ యంత్రాంగానికి తెలిసినా తెలియనట్టు వ్యవహరిస్తున్నాయన్నారు. తక్షణమే వాటిని వెలికి తీయాలని డిమాండ్ చేశారు. కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు రాజకీయ పలుకుబడి కలిగిన వ్యక్తులు ఆక్రమించుకుంటే పట్టించుకోకుండా ఉండడం చట్టవిరుద్ధమన్నారు. సర్వే నంబర్లు, విస్తీర్ణం, రెవెన్యూ గ్రామాల తో సహా వివరాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయని అయినప్పటికీ నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. భూములకు విలువ పెరిగిన తర్వాత సీలింగ్ పేరుతో విచ్చేసిన భూములను తిరిగి పాత యజమాని పొందే ప్రయత్నం చేయడం, రిజిస్ట్రేషన్ అధికారుల వత్తాసుతో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇప్పటికైనా నా జిల్లా కేంద్రాన్ని ఆనుకొని ఉన్న మిగులు భూమితోపాటు, లింగాల గణపురం, పాలకుర్తి, జఫర్ గడ్డ, దేవరుప్పుల, జనగామ, బచ్చన్నపేట, రఘునాథ పెళ్లి మండలాల్లో పడావుగా ఉన్న, ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను రక్షించి పేదలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రత్యక్ష పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా ఆఫీస్ బేరర్లు పోత్కనూరి ఉపేందర్, సోమ సత్యం, గంగాపురం మహేందర్, గోసంగి శంకరయ్య, చెన్నూరి ఉప్పలయ్య, కాకర్ల రమేష్, సోమయ్య, ఓగ్గుల లక్ష్మణ్ పాల్గొన్నారు.