Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
కాకతీయ అర్భన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) ఔటర్ రింగ్‌రోడ్డుకు ఇరువైపులా 27 గ్రామాల్లో 22 వేల ఎకరాలను ల్యాండ్ పూలింగ్‌కు సేకరించాలని నోటిఫికేషన్ ఇచ్చిన నాటి నుండి రైతుల గుండెలు రగిలిపోతు న్నాయి. గ్రామాల్లో రైతు ఐక్య కార్యాచరణ సమితులను ఏర్పాటు చేసుకొని ఆందోళనలు తీవ్రతరం చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా దిగివచ్చింది. అయినా రైతులు శాంతించలేదు. నోటిఫికేషన్‌ను తాత్కాలికంగా నిలుపు చేస్తున్నట్లు ఎమ్మెల్యేలు ప్రకటించినా, రైతులు ఊరుకోలేదు. దీంతో జీవో రద్దు చేస్తు న్నట్లు మంత్రి, ఎమ్మెల్యేలు ప్రకటించారు. వీరి ప్రకటనను రైతులు విశ్వసించడం లేదు. దీంతో పెరుమాండ్లగూడెం గ్రామ సందర్శనలో వర్ధన్న పేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ను రైతులు అడ్డుకు న్నారు. దీన్ని ఎమ్మెల్యే సీరియస్‌గా తీసుకున్న నేపథ్యంలో అదే రాత్రి అడ్డుకున్న ముగ్గురు రైతుల్ని ఐనవోలు సిఐ, ఎస్సైలు తీసుకువెళ్లి థర్డ్ డిగ్రీలో బాదడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన రైతుల్లో మరింత ఆగ్రహాన్ని తెప్పిం చింది. ఎట్టకేలకు పెరుమాండ్ల గూడెం బాధిత రైతులు మానవ హక్కుల కోర్టును ఆశ్రయిం చారు. దీంతో అధికార టిఆర్ఎస్ పార్టీ ఇరుకు నపడింది. ఈ సంఘటన మొత్తంగా టిఆర్ ఎస్పై వచ్చే ఎన్నికల నాటికి ప్రభావం చూపే అవకాశమున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
'కుడా' ఆధ్వర్యంలో ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ వెలువడిన నాటి నుండి టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పడం లేదు. తొలుత తక్కువ అంచనా వేసిన టిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పలు ప్రాంతాల్లో రైతులు షాక్ ఇచ్చారు. ఇదే క్రమంలో విపక్షాలు రోడ్డెక్కి రైతు లకు మద్దతు పలకడంతో టిఆర్ఎస్ సర్కార్ ఒక మెట్టు దిగడానికి సిద్దమైంది. తాత్కాలి కంగా జివోను నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటిం చారు. అయినా రైతులు జీఓ 80ఎను రద్దు చేయాలని, అప్పటి దాకా పోరాటం ఆపేది లేదని ఆందోళనలను ఉధృతం చేశారు. దీంతో వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు, వర్ధన్న పేట, పరకాల, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యేలు ల్యాండ్ పూలింగ్ జీవోను రద్దు చేయకపోతే రానున్న ఎన్నికల్లో రైతుల నుండి తీవ్ర ప్రతిఘటన ఎదురయ్యే అవకాశముందని పార్టీ అధిష్టానానికి చెప్పుకోవడంతో ఎట్టకేలకు మంత్రి దయాకర్‌రావు నేతృత్వంలో ఎమ్మెల్యేలు దాస్యం వినరుభాస్కర్, నరేందర్, చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేశ్, డాక్టర్ రాజయ్యలు సమావేశమై జీవోను రద్దు చేసినట్లు ప్రకటిం చారు. వీరు చేసిన ప్రకటనను రైతులు నేటికీ నమ్మడం లేదు. ఈ క్రమంలోనే ఐనవోలు మండలం పెరుమాండ్ల గూడెంలో పలు అభి వృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి విచ్చేసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్‌ను ల్యాండ్ పూలింగ్ను వ్యతిరేకిస్తున్న రైతులు అడ్డుకు న్నారు. ఈ క్రమంలో టిఆర్ఎస్ నేతలు రైతు లను నెట్టేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే వాహనానికి ముందు, వెనకా మొద్దులు వేసి కదలకుండా చేసి 80ఎ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
రైతులపై థర్డ్ డిగ్రీ.. తెర వెనుక ఎమ్మెల్యే..
పెరుమాండ్లగూడెంలో తనను అడ్డుకోవ డంపై ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఐనవోలు సిఐ, ఎస్సైలు యుద్ధ ప్రాతిపదికన అదేరోజు రాత్రి ఎమ్మెల్యేను అడ్డుకున్న రైతులను పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లి తీవ్ర పరుష పదజాలంతో మాట్లాడుతూ థర్డ్ డిగ్రీ ప్రయోగించి తీవ్రంగా కొట్టారు. ఈ విషయం బయటకు పొక్కడంతో అటు రైతు ఐక్య కార్యచరణ సమితి వరంగల్ జిల్లా కమిటీ నేతలు, ఇటు బిజెపి, కాంగ్రెస్ నేతలు పెరుమాండ్లగూడెం గ్రామాన్ని సంద ర్శించి బాధిత రైతులను పరామర్శించారు. ఈ సంఘటనపై రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
మా ఓట్లతో గెలిచి మమ్మల్ని కొట్టిస్తారా..
మా ఓట్లతో గెలిచి మా భూములను లా క్కుంటుంటే అడ్డుకుంటే మమ్మల్ని కొట్టిస్తారా ? అంటూ పెరుమాండ్ల గూడెం రైతులు, మహిళా రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు దండం పెడుతూ గెలి చాక మా భూములను లాక్కుంటూ మమ్మల్ని రోడ్డున పడేస్తారా ? మా భూములను కాపా డుకోవడానికి మేం ప్రయత్నిస్తే మాపైనే దౌర్జ న్యం చేస్తారా ? అంటూ ఎమ్మెల్యే, పోలీసు అధి కారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మానవ హక్కుల కోర్టుకు బాధిత రైతులు..
పోలీసు ఉన్నతాధికారులపై నమ్మకం లేక పెరుమాండ్ల గూడెం బాధిత రైతులు మానవ హక్కుల కోర్టును ఆశ్రయించారు. కాంగ్రెస్, బిజెపి నేతలు వరంగల్ పోలీసు కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషికి సిఐ విశేశ్వర్, ఎస్సై భరత్‌లపై బాధిత రైతులతో ఫిర్యాదు చేయించినా, బాధిత రైతులు మానవ హక్కుల కోర్టును ఆశ్రయించడం గమనార్హం.
టీఆర్ఎస్ నేతల్లో గుబులు
ల్యాండ్ పూలింగ్ పోరాటం, రైతుల నుండి వ్యక్తమైన వ్యతిరేకత, పెరుమాండ్లగూడెంలో రైతులపై థర్డ్ డిగ్రీ ప్రయోగం మొత్తంగా టిఆర్ఎస్ పట్ల రైతాంగంలో వ్యతిరేకత పెంచినట్టు కనిపిస్తుంది. రైతులు ఇప్పటికీ టిఆర్ఎస్ పార్టీపై తీవ్ర ఆగ్రహంతో వున్నారు. మమ్మల్నే కొట్టిస్తారా ? అని రైతులు టిఆర్ఎస్ పార్టీ అంటేనే భగ్గుమంటున్నారు. వర్ధన్నపేట నియోజకవర్గంలో ఇలాంటి పలు సంఘటనలు గతంలోనూ జరిగాయని తెలుస్తుంది. హసన్‌పర్తి మండలం జయగిరి గ్రామంలో ఎమ్మెల్యే రమేశ్ మాట్లాడుతుండగా, ఒక గ్రామస్తుడు ప్రశ్నించినందుకు కెయు సిఐ దయాకర్, సిబ్బంది ఆ గ్రామస్తుడిని చితకబాదినట్లు గ్రామస్తులు తెలిపారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసిన సంఘటనలు ఒక్కటికొక్కటిగా అన్ని బయటకు వస్తుండడంతో పార్టీ భవితవ్యంపై ఈ ప్రభావం పడే అవకాశం లేకపోలేదు.