Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోడ్ల మీద దుకాణాలతో ఇబ్బందులు..
- నోటీసులతోనే సరి.. చర్యలు శూన్యం..
- పల్లెప్రగతిలోనైనా మోక్షం లభించేనా..?
నవతెలంగాణ-వెంకటాపురం
మండలంలో మార్కెట్ భవన నిర్మాణాల కోసం నిధులు ఎప్పుడు కేటాయిస్తారు.. ఆ నిధులతో మార్కెట్ ఏర్పాటు కోసం సౌకర్యాలు ఎప్పుడు కల్పిస్తారో.. రోడ్లపై ఉన్న దుకాణాలు, ఆక్రమణలను పంచాయితీ అధికారులు ఎప్పుడు తొలగిస్తారో.. అనే అయోమయ స్థితిలో మేజర్ గ్రామపంచాయతీ ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేసట్టిన పల్లెప్రగతి కార్యక్రమంపై జిల్లా అధికారుల పర్యవేక్షణ లోపానికి తోడు మండల అధికారుల నిర్లక్ష్యం కారణంగా అభాసుపాలౌతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రెండో విడుత పల్లెప్రగతిలో భాగంగా అప్పటి ప్రత్యేక అధికారి, మండల పరిషత్, పంచాయతీ అధికారులు 15 రోజులపాటు డ్రైనేజీలపై నిర్మించిన పక్కా కట్టడాలను జేసీబీలతో కూల్చి వేశారు. రోడ్లపై ఉన్న చిరువ్యాపారులకు చెందిన బడ్డీ దుకాణాలు సైతం తీసుకునేందుకు సమయం ఇవ్వలేదు. డ్రైనేజీలకు ఇవతల ఉన్న దుకాణాలన్నిటినీ అవతలకు మార్పించారు. పల్లె ప్రగతి ముగిసింది. ఇప్పుడు దుకాణాలన్నీ మళ్లీ రోడ్లెక్కాయి. డ్రైనేజీ దాటి ప్రధాన రహదారికి అతి సమీపంలో దుకాణాలు వేలిశాయి. బస్టాండ్ సమీపంలో రోడ్లపైనే దుకాణాలు వెలిశాయి. ప్రమాదాలకు నిలయంగా మారాయని పంచాయితీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కనీసం పట్టించుకున్న నాథుడే కరవయ్యారని మండల ప్రజలు వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి మండలంలో మాత్రం ఆరంభ శూరత్వంగా మారిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ప్రమాదం జరిగితే తప్ప పట్టించుకోరా..?
భద్రాద్రి కొత్తగుడెం జిల్లాతోపాటు వెంకటాపురం మండలం ఇసుక ర్యాంపు నుంచి ప్రతి రోజూ వందల సంఖ్యలో ఇసుక లారీలు ప్రధాన రహదారిపై నుంచి వెళ్తున్నాయి. వెంకటాపురం-వాజేడు ప్రధాన రహదారిపై నిత్యం వందల సంఖ్యలో ఇసుకను లారీల్లో పట్టణాలకు తరలిస్తున్నారు. మండలంలో ప్రధాన రహదారికి కనీసం మీటరు దూరం కూడా లేకుండా దుకాణాలు నిర్వహిస్తున్నారు. ఇసుక లారీలు సైతం వేగంగా ప్రయాణిస్తున్నాయి. మితిమీరిన వేగంతో వెళ్తున్న లారీల వల్ల నిత్యం ఏదో ఒకచోట ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రోడ్లపైకి వచ్చిన దుకాణాల వల్ల మరిన్ని ప్రమాదాలు సంభవించక ముందే దుకాణాలను, డ్రైనేజీ దాటి ముందుకొచ్చిన ఆక్రమణలను తొలగించాల్సిన అవసరం ఉంది.
ప్రత్యేక స్థలం కేటాయించినా..
రోడ్ల మీద దుకాణాలు నిర్వహించకుండా పల్లె ప్రగతిలో భాగంగా దుకాణాల నిర్వహన కోసం బస్టాండ్ సమీపంలో ప్రత్యేక స్థలాన్ని అధికారులు కేటాయించి ముగ్గుపోశారు. పల్లెప్రగతి సమయంలో ఆ స్తలంలోనూ దుకాణాలు నిర్వహించి తిరిగి రోడ్లపైనే దుకాణాలు వెలిశాయి. ప్రధాన రహదారి ఇరుకుగా, రద్దీగా మారడంతో వాహనదారులు, పాదాచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మంత్రి గారు నిధులిచ్చి దుకాణాలను తొలగింపజేయాలి
డ్రైనేజీలు దాటి ప్రధాన రహదారులపైకి వచ్చిన దుకాణాలతో ఇబ్బందులు పడుతున్నట్లు ప్రజలు అధికారులకు ఫిర్యాదు చేసిన సమాయాల్లో అధికారులు హడావుడి చేయడం, అధికార పార్టీ నాయకులు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి దయాకర్‌రావు నిధులు మంజూరు చేస్తారని, ఆ నిధులతో ప్రత్యేక భవనాలు నిర్మించి ఆ భవనాల్లోకి రోడ్లపై ఉన్న దుకాణాలను తరలిస్తామంటూ చెబుతున్నా ఏండ్లు గడుస్తున్నా మంత్రి గారు నిధులు ఇవ్వలేదు. ఆ నిధులతో భవనాలు నిర్మించి మార్కెట్‌ను తరలించేది ఎప్పుడని మండల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
నోటీసులతో సరా...?
ప్రధాన రహదారిపై ఏదైనా ప్రమాదం జరిగితే లేదా ఆక్రమణలను తొలగించాలని ఉన్నతాధికారులకు మండల ప్రజలు ఫిర్యాదు చేసిన సందర్భాల్లో స్థానిక అధికారుల హడావుడి మొదలౌతోంది. ఆక్రమణదారులకు హడావుడిగా నోటీసులు జారీ చేస్తారు. నోటీసుల వెనుక ఉన్న ఆంతర్యమేమిటో అధికారులకే తెలియాలి. ఇకనైనా ఉన్నతాధికారులు ఐదో విడత పల్లె ప్రగతిలో భాగంగానైనా డ్రైనేజీలను దాటి రోడ్ల మీదకు వచ్చిన ఆక్రమణలను తొలగించే దిశగా అధికారులు చొరవ చూపాలని మండల ప్రజలు కోరుతున్నారు.